logo

ఓపెన్‌ నాలాలో పడి కార్మికుడి మృత్యువాత

ఓపెన్‌నాలాలో వ్యర్థాలు తొలగిస్తున్న పారిశుద్ధ్య ఒప్పంద కార్మికుడు అకస్మాత్తుగా నాలాలోనే మృతిచెందాడు. బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 01 Feb 2023 05:55 IST

ఎల్లేష్‌ మృతదేహం

కార్ఖానా, న్యూస్‌టుడే: ఓపెన్‌నాలాలో వ్యర్థాలు తొలగిస్తున్న పారిశుద్ధ్య ఒప్పంద కార్మికుడు అకస్మాత్తుగా నాలాలోనే మృతిచెందాడు. బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..మచ్చబొల్లారానికి చెందిన ఎమ్‌.ఎల్లేష్‌(30) కంటోన్మెంట్‌ బోర్డు పారిశుద్ధ్య విభాగంలో ఒప్పంద కార్మికుడు. మంగళవారం బోయిన్‌పల్లిలోని చిన్నతోకట్ట వంతెన వద్ద ఓపెన్‌నాలాలో తోటి కార్మికులు రవి, నాగరాజులతో కలిసి వ్యర్థాలు తొలగిస్తున్నాడు. రవి, నాగరాజు ఓవైపు.. ఎల్లేష్‌ ఓవైపు వెళ్లి వ్యర్థాలు తొలగిస్తున్నారు. నాలాలో ముందుకెళ్లిన కార్మికులు 15 నిమిషాల తరువాత వెనక్కి రాగా ఎల్లేష్‌ కనిపించలేదు. దీంతో వారు అతను వెళ్లిన వైపు నడిచారు. ఇంతలో నాలాలో ఓ చెట్టు వద్ద చెయ్యి పైకి లేచి కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా ఎల్లేష్‌ నాలాలో మునిగి కనిపించాడు. వారు బోయిన్‌పల్లి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి నాలా నుంచి అపస్మారక స్థితిలో ఉన్న ఎల్లేష్‌ను బయటకు తీశారు. 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబానికి అతడే ఆధారం..

ఎల్లేష్‌ తండ్రి కొంత కాలం క్రితమే చనిపోగా తల్లి జయమ్మ, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చెల్లెళ్ల వివాహలు జరిగాయి. పెద్ద సోదరి మహేశ్వరి భర్త ఇటీవల చనిపోగా పుట్టింట్లోనే ఉంటోంది. కుటుంబానికి అతడి సంపాదనే దిక్కు. ఇంట్లో ఉన్న ఒకే ఒక మగ దిక్కును కోల్పోయామంటూ అతని సోదరి మహేశ్వరి రోదించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని