logo

Hyderabad: బ్లూటూత్‌తో సైబర్‌ మాయ.. బ్లూబగ్గింగ్‌తో స్మార్ట్‌ఫోన్ల హ్యాకింగ్‌

చేతికి పెట్టుకున్న డిజిటల్‌ వాచీ, చెవులకి ధరించిన ఇయర్‌పాడ్‌ పనిచేయాలన్నా.. కారులో మ్యూజిక్‌ సిస్టమ్‌తో అనుసంధానమవ్వాలంటే బ్లూటూత్‌ ఒక్కటుంటే చాలు.

Updated : 01 Feb 2023 10:04 IST

అప్రమత్తత అవసరమంటున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు

ఈనాడు- హైదరాబాద్‌: చేతికి పెట్టుకున్న డిజిటల్‌ వాచీ, చెవులకి ధరించిన ఇయర్‌పాడ్‌ పనిచేయాలన్నా.. కారులో మ్యూజిక్‌ సిస్టమ్‌తో అనుసంధానమవ్వాలంటే బ్లూటూత్‌ ఒక్కటుంటే చాలు. హ్యాండ్‌ ఫ్రీ సాంకేతికతలో భాగంగా కుర్రకారు నుంచి పెద్దల వరకూ వైర్‌లెస్‌ పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. గత కొంతకాలంగా ఇయర్‌ఫోన్లు, డిజిటల్‌ చేతి గడియారాలు అందుబాటులోకి రావడంతో బ్లూటూత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. దీన్ని సైబర్‌ నేరగాళ్లు తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. బ్లూటూత్‌ ఆన్‌లో ఉండే ఫోన్లు లక్ష్యంగా పంజా విసురుతున్నారు. ‘బ్లూ బగ్గింగ్‌’ పేరిట పిలిచే ఈ హ్యాకింగ్‌ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

బ్లూ బగ్గింగ్‌ అంటే..?

సాధారణంగా ఫోన్‌కు సందేశాల ద్వారా లింకులు, సాఫ్ట్‌వేర్‌లు జోప్పించి హ్యాక్‌ చేస్తుంటారు. బ్లూబగ్గింగ్‌ విధానంలో మాత్రం బ్లూటూత్‌ ఆన్‌లో ఉన్న ఫోన్లను లక్ష్యంగా చేసుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు 10 మీటర్ల పరిధిలో బ్లూటూత్‌ ఆన్‌లో ఉన్న ఫోన్లతో బ్లూటూత్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపించి అనుసంధానం(పెయిర్‌) అవుతారు. తమ బ్లూటూత్‌ పేరును ఎదుటి వ్యక్తులు వినియోగిస్తున్న ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్స్‌ కంపెనీ పేరులా మార్చి కనెక్ట్‌ అయ్యేందుకు రిక్వెస్ట్‌ పంపుతారు. అది మనదే అని మనం ఒకసారి కనెక్ట్‌ అయితే అంతే. మన ఫోన్‌కు ఎలాంటి సందేశాలు రాకుండా రహస్యంగా కొన్ని రకాల మాల్‌వేర్లను పంపిస్తారు. ఫోన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటారు. మాల్‌వేర్లను పంపించడం ద్వారా కాంటాక్ట్‌, ఫొటోలు, ఇతర కీలక సమాచారం తస్కరించి బెదిరింపులకు దిగుతారు. విదేశాల్లో ఈ అనైతిక పద్ధతుల్ని విరివిగా వినియోగిస్తున్నారు.


ఇవీ జాగ్రత్తలు..!

* బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అవసరమైతే తప్ప బ్లూటూత్‌ ఆఫ్‌ చేయాలి.

* గుర్తుతెలియని పరికరాలు, పరిచయం లేని వ్యక్తులు బ్లూటూత్‌ ద్వారా పంపే పెయిరింగ్‌ రిక్వెస్ట్‌లకు స్పందించకూడదు.

* అవసరం లేకపోతే అప్పటివరకూ అనుసంధానమైన బ్లూటూత్‌ పరికరాలతో అన్‌పెయిర్‌ చేయాలి.

* బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రాంతాల్లో ఉచిత వైఫై వినియోగించొద్దు.

* డేటాలో హెచ్చుతగ్గుల్ని గమనిస్తూ ఉండాలి. అదనపు భద్రతకు వీపీఎన్‌ వాడాలి.


నేరగాళ్ల కొత్త దారి..
జి.శ్రీధర్‌, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ

‘సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. బ్లూ టూత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్నో అవకాశంగా తీసుకుని బ్లూబగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. మన దగ్గర ఇలాంటి కేసులు నమోదవకున్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరం’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు