logo

చెట్టెక్కిన మునగ, కరివేపాకు ధరలు

ఔషధంలా పని చేసే మునగ చెట్టు చలికి చిక్కింది. కరివేపాకు చెట్టుదీ అదే పరిస్థితి. ఈ రెండు చెట్ల ఆకులు కనిపించడంలేదు. అక్కడక్కడా మునగకాయలు వచ్చినా.. అవి పెరగకుండానే చెట్టుమీదే ముడుచుకుపోతున్నాయి.

Published : 01 Feb 2023 03:04 IST

బూడిద రంగులో మునగ

ఈనాడు - హైదరాబాద్‌: ఔషధంలా పని చేసే మునగ చెట్టు చలికి చిక్కింది. కరివేపాకు చెట్టుదీ అదే పరిస్థితి. ఈ రెండు చెట్ల ఆకులు కనిపించడంలేదు. అక్కడక్కడా మునగకాయలు వచ్చినా.. అవి పెరగకుండానే చెట్టుమీదే ముడుచుకుపోతున్నాయి. బూడిద రంగులో మారుతున్నాయి. నగరానికి సరకు రాక తగ్గడంతో ధర చెట్టెక్కి కూర్చుంది.

అక్కడ పండక..: సముద్ర తీర ప్రాంతాల్లో మునగ ఎక్కువగా పండుతుంది. మనకు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తుంది. ప్రస్తుతం చలిగాలులకు అడపా దడపా వర్షాలూ తోడై అక్కడ నుంచి పంట రావడంలేదు. ఇప్పుడు గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదర నుంచి వస్తున్నాయి. అందుకే మునగకాయల ధరలు భారీగా పెరిగాయి. ఎండలు బాగుంటే ఇక్కడా మునగ పంట అందుబాటులోకి వస్తుంది. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకూ సాధారణంగా నగరానికి 25 క్వింటాళ్ల వరకూ మునగకాయలు వస్తాయి. అప్పుడు వాటి కిలో ధర రూ.30లోపే ఉంటుంది. ఇప్పుడు వడోదర నుంచి కేవలం 1 నుంచి 2 క్వింటాళ్లే రావడంతో రూ.15కి ఒకటి.. రూ.20 పెడితే రెండు చొప్పున ఇస్తున్నారు. కరివేపాకు హోల్‌సేల్‌ మార్కెట్లోనే కిలో రూ.200 పలుకుతోంది. నగరానికి 250 క్వింటాళ్లు వస్తుండేది. ప్రస్తుతం 100 క్వింటాళ్లకు పరిమితమైంది. దీంతో ధరలు అధికమయ్యాయి.

చలిగాలులతో ముప్పు

పూత నుంచి వచ్చే ఏ పంట అయినా మంచు కురిసే వేళ ఉత్పత్తి తగ్గుతుంది. మునగచెట్టుకూ ఇదే వర్తిస్తుంది. శీతాకాలం వచ్చేసరికి చిగురించడం, పూతపూసి కాయ కాయడం తక్కువగా ఉంటుంది. ఒక వేళ అరకొరగా వచ్చినా బూడిద రంగుతో పాటు.. పెరుగుదల కూడా తక్కువగా ఉంటుంది. వాస్తవానికి మునగ పంట తెలంగాణలో అతి తక్కువగా వేస్తారు. బయట నుంచి రావడంతో కూడా మునగకాయలకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. - డా.భగవాన్‌, పరిశోధనా విభాగం సంచాలకులు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని