logo

గమ్యం చేరని ప్రయాణాలు

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్రలో మంగళవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది.

Published : 01 Feb 2023 03:04 IST

నగరంలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

నగర రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. అవుటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన ఘటనలో ఇద్దరు  అక్కడికక్కడే మృతి  చెందగా నలుగురు గాయపడ్డారు. ఎర్రగడ్డ వద్ద జరిగిన మరో ఘటనలో కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను డీసీఎం ఢీకొనగా భార్య మృత్యువాత   పడింది. యాచారం పరిధిలో జరిగిన మరో దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.


అవుటర్‌పై కంటైనర్‌ను కారు ఢీకొని ఇద్దరు..

ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు మృతిచెందిన కారు డ్రైవర్‌ ముస్తఫా షేక్‌

రాజేంద్రనగర్‌, బండ్లగూడజాగీర్‌: బాహ్య వలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు. రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన వెంకటగణపతి(48), జైత్రి(41), విరాట్‌(11), శ్రియ(9), మరో వ్యక్తి(35), మంగళవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగి కారులో ఔటర్‌ మీదుగా సోలాపూర్‌ బయలుదేరారు. తెలంగాణ పోలీసు అకాడమీ సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కారు నడుపుతున్న ముస్తఫా షేక్‌(40), జైత్రి ఘటనా ప్రదేశంలోనే తుదిశ్వాస వదిలారు. మిగతా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


తోడుగా వచ్చి.. ఒంటరిని చేసి

సెలవడిగేందుకు భర్తతో వెళ్లిన భార్య..

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: అనారోగ్యం కారణంగా సిక్‌ లీవ్‌ లెటర్‌ ఇవ్వడానికి తన కార్యాలయానికి బయల్దేరిన భర్తకు తోడు వెళ్లిన భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ ఎస్పీఆర్‌హిల్స్‌వాసి ఎస్‌.భరత్‌(36) బీహెచ్‌ఈఎల్‌ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భరత్‌.. సెలవులేఖ ఇవ్వడానికి బయల్దేరారు. తోడుగా ఆయన భార్య ఎస్‌.మమత(30) రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి స్కూటీపై ఉదయం 11గంటలకు వెళ్లారు. ఇచ్చి తిరిగొస్తుండగా ఎర్రగడ్డ వంతెనపై స్టీల్‌రాడ్ల లోడు డీసీఎం వీరి స్కూటీని వెనుకనుంచి ఢీకొంది. ముగ్గురూ రోడ్డుపై పడిపోగా మమత తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భరత్‌ గాయాలతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి క్షేమంగా బయటపడింది. డీసీఎం డ్రైవర్‌పరారయ్యాడు. కేసు నమోదుచేశారు.


ప్రగతి నివేదన యాత్రలో అపశ్రుతి.. వృద్ధుడి మృతి, 9 మందికి గాయాలు

జంగయ్య

యాచారం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్రలో మంగళవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. యాచారం మండలం గడ్డమల్లయ్యగూడెంలో యాత్ర తిలకించడానికి వచ్చిన గ్రామస్థులు, కార్యకర్తలపైకి ట్రాక్టర్‌ దూసుకురావడంతో 9మంది గాయపడ్డారు. ఒకరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఈ యాత్ర మంగళవారం సాయంత్రం గడ్డమల్లయ్యగూడెంకు చేరుకుంది. విరామ సమయంలో ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అల్పాహారం తీసుకుంటున్నారు. కార్యకర్తలు ప్రధాన రహదారి పక్కన నిల్చుని ముచ్చట్లలో మునిగారు. డ్రైవరు శంకరయ్య నడుపుతున్న ట్రాక్టర్‌ జనంపైకి దూసుకొచ్చింది. తులేకుర్దుకు చెందిన చెందిన రాజశేఖర్‌రెడ్డి(45), గడ్డమల్లయ్య గూడెంవాసులు విజయమోహన్‌రెడ్డి(65), నర్రె జంగయ్య(85), లచ్చయ్య(60), బీరప్ప(60), బౌరమ్మ50, రాములమ్మ(70) భారతమ్మ(55), ఇక్కె మల్లమ్మ(56), నర్సమ్మ(45) గాయపడ్డారు. ఇబ్రహీంపట్నంలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జంగయ్య మృతి చెందాడు. పోలీసులు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యంమత్తులో ఉన్నాడని స్థానికులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని