logo

నకిలీ నోట్లతో హవాలా సొమ్ము స్వాహా!

నకిలీ నోట్లతో సొమ్ము స్వాహా చేసిన  నలుగురు అంతరాష్ట్ర నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు

Published : 02 Feb 2023 06:44 IST

రూ.72.50 లక్షలు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న నగదు పరిశీలిస్తున్న నగర అదనపు సీపీ ఏ.ఆర్‌.శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్లు

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ నోట్లతో సొమ్ము స్వాహా చేసిన  నలుగురు అంతరాష్ట్ర నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బషీర్‌బాగ్‌ నగర సీపీ కార్యాలయంలో బుధవారం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీకాంత్‌రెడ్డితో కలసి నగర అదనపు సీపీ ఏ.ఆర్‌.శ్రీనివాస్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

రంగులతో... ఏమార్చారు.. రాజస్థాన్‌కు చెందిన కన్హయ్యలాల్‌ అలియాస్‌ జతిన్‌ (30) ప్రస్తుతం హౌరాలో స్లైడింగ్‌ విండో తయారీ వ్యాపారం చేస్తున్నాడు. అదేరాష్ట్రానికి చెందిన రామావతార్‌శర్మ అలియాస్‌ మోహన్‌(24), భరత్‌కుమార్‌(26), రామకిషన్‌ శర్మ(25)తో కలసి హవాలా సొమ్ము గమ్యానికి చేరవేస్తుంటాడు. కళ్లెదుట రూ.లక్షలు కనిపించటంతో కొట్టేయాలనే పథకం వేశాడు. నలుగురూ కలసి  అసలుకు బదులుగా నకిలీ (స్కానింగ్‌ తీసిన) రూ.500, 2000లను నోట్ల కట్టలకు ఇరువైపులా ఉంచేవారు. మధ్యలో నకిలీ నోట్లు/తెల్ల కాగితాలు ఉంచేవారు.  నగదు అవతలి వారి చేతికిచ్చి తెలివిగా నిందితులు తప్పించుకునేవారు. ఇదే తరహాలో గతేడాది డిసెంబరులో నాంపల్లి హోటల్‌ నిర్వాహకుడు మహ్మద్‌ యూనస్‌కు అప్పగించాల్సిన రూ.30 లక్షల నగదుకు బదులు అంతే మొత్తం నకిలీ నోట్లను అప్పగించారు. గత నెల 3న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది డిసెంబర్‌లోనూ రూ.50 లక్షలు ఇదే తరహాలో  మోసగించారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు  సికింద్రాబాద్‌ లాడ్జిలో నిందితులను అరెస్ట్‌ చేసి.. వారి నుంచి రూ.72.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని