logo

బ్రూస్లీ.. కన్ను పడితే ఇళ్లు ఖాళీ!

గ్రేటర్‌లో వరుస చోరీలతో హల్‌చల్‌ చేసిన దొంగలను నగర మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఏపీ, తెలంగాణాల్లో రోజుల వ్యవధిలోనే 23 గృహ దొంగతనాలకు పాల్పడ్డారు.

Published : 02 Feb 2023 06:43 IST

స్వాధీనం చేసుకున్న సొత్తుతో టాస్క్‌ఫోర్స్‌ బృందం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో వరుస చోరీలతో హల్‌చల్‌ చేసిన దొంగలను నగర మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఏపీ, తెలంగాణాల్లో రోజుల వ్యవధిలోనే 23 గృహ దొంగతనాలకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంతో నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం బషీర్‌బాగ్‌ సీపీ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, మధ్యమండలం ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌తో కలిసి నగర అదనపు సీపీ ఏ.ఆర్‌.శ్రీనివాస్‌ వివరాలు తెలిపారు. ప్రధాన నిందితుడు దార్ల నెహెమియా అలియాస్‌ బ్రూస్లీ (26) స్వస్థలం కర్ణాటకలోని హుబ్లీ. బాల్యంలోనే తల్లిదండ్రులతో కలసి ఖమ్మం వచ్చాడు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది.  12-13 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో హోటళ్లలో పనిచేశాడు. బ్రూస్లీ అభిమాని కావడంతో మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాడు. బ్రూస్లీ బాయ్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 11 నాన్‌బెయిల్‌బుల్‌ కేసులున్నాయి.  పలుమార్లు జైలుకెళ్లాడు. జైల్లో కర్ణాటకకు చెందిన మందుల శంకర్‌ అలియాస్‌ శంకర్‌ చంద్రప్ప (21) పరిచయమయ్యాడు. ఇతడిపై ఓయూ ఠాణాలో పోక్సో కేసు నమోదైంది.  ఇద్దరూ ఫతేనగర్‌లో ఉంటూ మూడు కమిషనరేట్ల పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత నెలలో కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ కాలనీల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. బ్రూస్లీ చోరీకు వెళ్లేముందు మద్యం తాగి గంజాయి పీల్చుతాడు. కాజేసిన ఆభరణాలను చందానగర్‌, పటేల్‌నగర్‌కు చెందిన మజోన్‌కుమార్‌ మాలిక్‌ (34), నామాల శ్రీధర్‌ (26)కు ఇచ్చి సొమ్ము చేసుకునేవారు. సీసీ ఫుటేజ్‌లో పోలీసులు వీరిని గుర్తించి నలుగురినీ అరెస్ట్‌ చేశారు. రూ.20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని