logo

బీసీలకు రూ.2 వేల కోట్లేనా?: ఆర్‌.కృష్ణయ్య

రూ.45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు కేవలం 2 వేల కోట్లు కేటాయించి దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అవమానించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు.

Published : 02 Feb 2023 03:21 IST

కాచిగూడ: రూ.45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు కేవలం 2 వేల కోట్లు కేటాయించి దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అవమానించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు నీరడి భూపేశ్‌సాగర్‌లతో ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏడున్నర దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.  

మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట: గీతామూర్తి

కేంద్ర బడ్జెట్‌లో ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ స్కీం’ ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట వేశారని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అన్నారు. పన్ను మినహాయింపు రూ.7 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కరోనాతో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యంతో ప్రపంచ దేశాలు అతలాకుతలమైతే భారత్‌ అభివృద్ధి దిశగా పురోగమిస్తుందన్నారు.

విశ్వబ్రాహ్మణ యోజన పథకం: కుందారం గణేశ్‌చారి

కేంద్ర బడ్జెట్‌లో ‘విశ్వ బ్రాహ్మణ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోని 11 కోట్ల మంది విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు చేపట్టారని తెలంగాణ బీసీ కుల సంఘాల ఐకాస ఛైర్మన్‌ కుందారం గణేశ్‌చారి పేర్కొన్నారు. బుధవారం అంబర్‌పేటలో ఆయన మాట్లాడారు. వృత్తుల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తున్న విశ్వబ్రాహ్మణుల సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని కేంద్రం: శారదాగౌడ్‌

కేంద్రం మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుండ్రాతి శారదాగౌడ్‌ అన్నారు. బుధవారం అంబర్‌పేటలోని కార్యాలయంలో ఆమె మాట్లాడారు. స్వయం ఉపాధికి మహిళలకు రాయితీ రుణాల ప్రస్తావనే లేదన్నారు.  

బీసీల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం: రాజేందర్‌పటేల్‌గౌడ్‌

దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు బడ్జెట్‌లో కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించి వారి సంక్షేమాన్ని విస్మరించిందని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ అన్నారు. బుధవారం చాదర్‌ఘాట్‌ మోతీమార్కెట్‌లోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాలవారీగా ఈ నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తారో చెప్పాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని