logo

150 దేశాలకు భారత్‌ నుంచే టీకాలు

ఒకప్పుడు టీకాల కోసం విదేశాల వైపు చూడాల్సివచ్చేదని.. ఇప్పుడు మనమే 150కి పైగా దేశాలకు టీకాలు అందిస్తున్నామని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు.

Published : 03 Feb 2023 01:44 IST

ఐఏపీఎస్‌ఎం సదస్సులో గవర్నర్‌

జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: ఒకప్పుడు టీకాల కోసం విదేశాల వైపు చూడాల్సివచ్చేదని.. ఇప్పుడు మనమే 150కి పైగా దేశాలకు టీకాలు అందిస్తున్నామని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. ఇందులో శాస్త్రవేత్తలు, వైద్యుల అంకితభావం, కృషి ఎంతో ఉందన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌ ఆధ్వర్యంలో.. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం) జాతీయ సదస్సు హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)లో గురువారం ప్రారంభమైంది.

‘ప్రజారోగ్యం-ఆత్మపరిశీలన-ఆవిష్కరణలు: ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం’ అంశాన్ని థీమ్‌గా ఎంపికచేశారు. గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. అంటువ్యాధులు, జీవనశైలి వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి, అపోహలు తొలగించడం ముఖ్యమని చెప్పారు. ఈ సందర్భంగా తాను తంజావూరు వైద్యకళాశాలలో పనిచేస్తున్నప్పుడు ఎదురైన ఘటనను గుర్తుచేశారు. గర్భిణులకు ఐరన్‌ మాత్రలు అందిస్తే.. అవి నలుపు రంగులో ఉన్నాయని, వాటిని వాడితే పిల్లలకు అదే రంగు వస్తుందన్న అపోహతో అక్కడే పడేసినట్లు చెప్పారు. తర్వాత చాలా సదస్సుల్లో ఐరన్‌ మాత్రలను రంగుల్లో తేవాలని సూచించానన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొ.డాక్టర్‌ వికాస్‌ భాటియా, ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, ఐసీఎంఆర్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏఎం ఖద్రీ, ఐఏపీఎస్‌ఎం ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ డాక్టర్‌ పురుషోత్తం గిరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని