logo

నగరంలో పాదచారి భద్రతకు పెద్దపీట

పాదచారుల భద్రతకు నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు దాటేందుకు వేచి ఉండేలా ఐలాండ్‌లను తీర్చిదిద్దుతున్నారు.

Published : 03 Feb 2023 01:44 IST

ట్రాఫిక్‌  అదనపు కమిషనర్‌ సుధీర్‌బాబు

బంజారాహిల్స్‌ కూడలిలో పెడస్టీరియన్‌ ఐలాండ్‌ వద్ద సుధీర్‌బాబు,

పక్కన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహరాజు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పాదచారుల భద్రతకు నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు దాటేందుకు వేచి ఉండేలా ఐలాండ్‌లను తీర్చిదిద్దుతున్నారు. మీట నొక్కి రోడ్డు దాటేందుకు ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన తరహాలో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన పెడస్టీరియన్‌ ఐలాండ్‌ను నగర పోలీసు అదనపు కమిషనర్‌ (ట్రాఫిక్‌) సుధీర్‌బాబు బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.

23 ప్రాంతాల్లో ఐలాండ్‌లు, 30 పెలికాన్‌ క్రాసింగ్‌లు..

బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానవన కూడలి, ఎస్‌ఎన్‌టీ కూడలి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పంజాగుట్ట, ఎంజే మార్కెట్‌, ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం తదితర ప్రాంతాల్లో పెడస్టీరియన్‌ ఐలాండ్‌లు ఏర్పాటు చేశాం. సురక్షితంగా రోడ్డు మరోవైపుకు చేరే క్రమంలో వేచి ఉండేందుకు వీటిని తీర్చిదిద్దాం. ఇలా నగరంలో దాదాపు 23 ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. ఖైరతాబాద్‌ తరహాలో మీట నొక్కి రోడ్డు దాటేలా మరో 30 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నాం. మెహదీపట్నంలో స్కైవాక్‌ పనులు కొనసాగుతున్నాయి.

సగటు వేగం.. 25 కి.మీ.

బెంగళూరు, ముంబయి, దిల్లీ తదితర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ నగరంలో వాహనదారుడి సగటు వేగం మెరుగ్గా 25 కి.మీ. ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవద్దనే ఆలోచనతో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నాం. జూబ్లీహిల్స్‌లోని కారిడార్‌లో పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ మార్పులు చేశారు. దీని వల్ల వాహనదారుడి సమయం గణనీయంగా తగ్గింది. కొన్ని చోట్ల చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. రహదారుల తీరు, డిజైనింగ్‌ ఆధారంగా ఇబ్బంది తప్పడం లేదు.

ప్రతి రోజు 1100 కొత్త వాహనాలు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 80 లక్షల వాహనాలున్నాయి. ప్రతిరోజు 1100 వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌ సాఫీగా సాగిపోవడానికి సిబ్బందిని పెంచడంతోపాటు సాంకేతికంగా చర్యలు చేపడుతున్నాం. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని రాయల్‌ టిఫిన్‌ సెంటర్‌ మూల మలుపు వద్ద ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ట్రాఫిక్‌ ఇంజినీరింగ్‌, జీహెచ్‌ఎంసీ కలిసి అధ్యయనం చేయనున్నాయి. నివేదిక ఆధారంగా చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు