logo

సమావేశాలకు దూరం.. అందని వ్యవసాయం

క్షేత్రస్థాయిలో మాత్రం వారి జాడ కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో పలుచోట్ల వ్యవసాయ కార్యాలయాలతో పాటు, గ్రామాల్లోని రైతు వేదికలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

Published : 03 Feb 2023 01:42 IST

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

‘రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు అందజేసి అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలి.’

-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇటీవల తాండూరు మండలం అంతారం రైతు వేదికలో అన్న మాటలివి.

క్షేత్రస్థాయిలో మాత్రం వారి జాడ కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో పలుచోట్ల వ్యవసాయ కార్యాలయాలతో పాటు, గ్రామాల్లోని రైతు వేదికలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

క్లస్టర్‌కు ఒకరు నియామకం..

జిల్లా వ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 2.36 లక్షల మంది రైతులున్నారు. మండలాల వారీగా వ్యవసాయాధికారులు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు.

రబీలో ప్రధానంగా కంది, పత్తి, వరి, పెసర, మినుము, సోయాబిన్‌, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. 5వేల సాగు భూములను ఒక క్లస్టరుగా విభజించి ఒక్కో వ్యవసాయ విస్తరణ అధికారిని (101 మంది) సర్కారు నియమించింది. వీరంతా గ్రామాలకు వెళ్లి ఉదయం పంటల్ని పరిశీలించి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా రైతు వేదికల్లో అందుబాట్లో ఉండాల్సి ఉండగా ఆ ఛాయలు ఎక్కడా కనిపించడంలేదు.

రైతు వేదికలు వారాల తరబడి మూతబడి దర్శనమిస్తున్నాయి. అందులో విలువైన సామగ్రి దుమ్ము పట్టి నిరుపయోగంగా మారాయి. తాండూరు వ్యవసాయ కార్యాలయంలోనూ అధికారులు వారంలో రెండుమూడు రోజులు విధులకు వచ్చి వెళ్తున్నారని పలువురు పేర్కొన్నారు. కార్యాలయంలో విగణిత నిర్వాహకుడు, అటెండరు హాజరవుతుండగా అధికారుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలతోనైనా అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాట్లో ఉండి సాగుకు సూచనలు, సలహాలు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇకనైనా స్పందించాలి: మల్లేష్‌, వీర్‌శెట్టిపల్లి

మా బాబాయ్‌ ఇటీవల మృతి చెందాడు. రైతు బీమా పథకం పరిహారం పొందేందుకు దరఖాస్తు చేసేందుకు కార్యాలయానికి వచ్చా. అధికారులు లేరు. తమ కష్టాలు చూసైనా అధికారులు స్పందించి సాయం చేయాలి.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: దస్తప్ప, చంద్రవంచ

తెలంగాణా గ్రామీణ బ్యాంకులో పంట రుణానికి దరఖాస్తు చేశా. వ్యవసాయ అధికారిణి ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మన్నారు. కార్యాలయానికి రోజూ వస్తున్నా అధికారులు ఉండటం లేదు. కరణ్‌కోటలోని రైతు వేదిక తెరుచుకోవడం లేదు. ప్రభుత్వమే ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని