logo

మూడొంతులకు ముప్పే

నగరంలో ఐదంతస్తుల ఎత్తులోపు ఉన్న 80 శాతం వాణిజ్య భవనాల్లో పూర్తిస్థాయిలో అగ్నినిరోధక వ్యవస్థ లేదని అధికారుల తాజా పరిశీలనలో వెలుగులోకి వచ్చింది.

Published : 04 Feb 2023 03:17 IST

నగరంలో 80 శాతం వాణిజ్య భవనాల్లో నిప్పునార్పే వ్యవస్థే లేదు!
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో నిగ్గు తేలిన నిజం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ఇటీవల ఆజామాబాద్‌ పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎగసిపడుతున్న మంటలు

నగరంలో ఐదంతస్తుల ఎత్తులోపు ఉన్న 80 శాతం వాణిజ్య భవనాల్లో పూర్తిస్థాయిలో అగ్నినిరోధక వ్యవస్థ లేదని అధికారుల తాజా పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిజాన్ని నిగ్గుతేల్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సర్కారు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో వాణిజ్య భవనాల పరిశీలన కోసం  కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను మొదలుపెట్టారు.

నగరంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అగ్నిమాపక చట్టంలో 15 మీటర్ల ఎత్తులో అంటే ఐదంతస్తుల వరకు ఉన్న వాణిజ్య భవనాల నిర్మాణం సమయంలో అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన లేదు. దీంతో సదరు భవన యజమానులు చాలామంది ఫైర్‌సేఫ్టీ ఏర్పాటు చేయడం లేదు. కొందరు భవనాలను ఏకంగా గోదాములుగా మార్చేసి అగ్నిప్రేరేపిత నిల్వలను ఉంచుతున్నారు. ఈ కారణంగానే అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అగ్నిమాపక, విద్యుత్తు, బల్దియా విజిలెన్సు  అధికారులతో కమిటీలను రూపొందించింది. ఈ కమిటీలు భవనాల పరిశీలన ప్రారంభించాయి.  సంబంధిత భవనంలో అగ్నినిరోధక వ్యవస్థ ఉందా? విద్యుత్తు వైరింగ్‌ ఎలా ఉంది? ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి? నిల్వలు ఏమైనా ఉన్నాయా? తదితర విషయాలను పరిశీలించారు.

మార్చినెలాఖరులోగా..

ఇప్పటికే బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌10లో పెన్షన్‌ ఆఫీస్‌ నుంచి పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వరకు ఇరువైపులా ఉన్న వాణిజ్య భవనాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటివరకు 575 భవనాలను పరిశీలిస్తే అందులో 80 శాతం వాటిలో  అగ్నినిరోధక వ్యవస్థ లేదని తేలింది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని భావించాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.  నగరంలో 15 మీటర్ల ఎత్తులోపు ఉన్న చిన్నాపెద్దా వాణిజ్య భవనాలు లక్షకుపైగా ఉన్నాయని అంచనా. వచ్చే మార్చి నెలాఖరులోగా ఈ పరిశీలన పూర్తి చేసి, మే నెల నాటికి అన్ని భవనాల్లో ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  బల్దియా సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.

నూతన సచివాలయం చెంత అప్రమత్తం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: నూతన సచివాలయ భవనంలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో పోలీసుల అప్రమత్తమయ్యారు. తెలుగు తల్లి కూడలి నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వెళ్లే దారిని మూసేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయంలో చోటుచేసుకున్న సంఘటనపై పోలీసులను సంప్రదించగా నోరు మెదపడంలేదు. తమకెలాంటి ఫిర్యాదు రాలేదని.. ఏం జరిగిందో తమకు తెలియదని సమాధానం దాటవేశారు. మీడియా ప్రతినిధులను భవనం లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు.


గ్రీన్‌ ఛానల్‌ కంటితుడుపు చర్యేనా?

ఈనాడు, హైదరాబాద్‌:  అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రతిస్పందించి ఘటనా స్థలానికి చేరుకోవడంలో ట్రాఫిక్‌ ప్రధాన అడ్డంకిగా మారింది. ట్రాఫిక్‌ విభాగం గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేస్తున్నా అది కేవలం కంటి తుడుపు చర్యగానే ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడంలో సుమారు 5 నుంచి 15 నిమిషాల వ్యవధి పెరుగుతోంది. ఈ లోపు నష్టం జరిగిపోతోంది. అగ్నిమాపకశాఖ నివేదిక ప్రకారం.. గతేడాది నగరంలో 881 అగ్నిప్రమాదాలు సంభవిస్తే అందులో 12 మంది మరణించగా.. రూ.9.2 కోట్ల ఆస్తినష్టం సంభవించింది.

ట్రాఫిక్‌తో ఇక్కట్లు... అగ్నిమాపక వాహనాలు  పదుల సంఖ్యలో కూడళ్లను దాటుకొని వస్తుండడంతో  వేగం మందగిస్తోంది. అతి కష్టం మీద సిగ్నల్‌ వద్దకు చేరుకుంటే తప్ప ఈ గ్రీన్‌ఛానెల్‌ ఉపయోగపడటం లేదు. దీంతో ఒక్కో సిగ్నల్‌ వద్ద సుమారు 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది. ఈ వృథాను తగ్గించేలా సిగ్నళ్ల వద్ద మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు