logo

‘సహకారం’.. అభ్యున్నతికి దోహదం

అన్నదాతల సంక్షేమానికి ఏర్పాటైన ప్రాథమిక సహకార సంఘాలు క్రమంగా సేవలను విస్తరిస్తున్నాయి. నిబంధనలను సరళతరం చేస్తూ ఇతర బ్యాంకులకు దీటుగా పనిచేస్తున్నాయి.

Published : 04 Feb 2023 03:17 IST

పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, బషీరాబాద్‌, న్యూస్‌టుడే: అన్నదాతల సంక్షేమానికి ఏర్పాటైన ప్రాథమిక సహకార సంఘాలు క్రమంగా సేవలను విస్తరిస్తున్నాయి. నిబంధనలను సరళతరం చేస్తూ ఇతర బ్యాంకులకు దీటుగా పనిచేస్తున్నాయి. గతంలో సొసైటీ నుంచి అప్పు తీసుకోవాలంటేనే రైతులు భయపడేది. అలాంటిది నేడు వేలాది మంది వీటితో ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. ఒకప్పుడు పంట రుణాలకే పరిమితం కాగా, ప్రస్తుతం గృహ, విద్య, వ్యక్తిగతం, వాహనాలు, చిరు వ్యాపారులు, కర్షక మిత్ర, వ్యవసాయ, వ్యాపారం తదితర వాటికి రుణాలను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం గ్రామాల్లో అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తద్వారా ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు సంఘాలు పోటీపడుతున్నాయి. యూనిట్లు, అవసరాన్ని బట్టి రూ.10లక్షలు మొదలుకుని రూ.75లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు.

జిల్లాలో 51 సంఘాలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా అందులో 1,92,987 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. పంట రుణాలను సైతం అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించేందుకు కృషి చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో రూ.274 కోట్లను పంపిణీ చేసిన డీసీసీబీ ప్రస్తుత యాసంగి సీజన్‌కు రూ.345 కోట్లు పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వారం రోజుల్లోగా అందజేస్తామని చెబుతున్నారు. రుణం తీసుకున్న రైతు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.

వసూళ్లలోనూ పురోగతి

తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు రైతులు సైతం ముందుకు వస్తున్నారు. 51 సంఘాల్లో 50% శాతం రికవరీ సాధించిన సంఘాలు సగానికి సగానికి పైగా ఉన్నాయి. వానాకాలం పంటలు చేతికందడంతో వసూళ్ల శాతం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.

సకాలంలో చెల్లిస్తే..: సకాలంలో తిరిగి చెల్లిస్తే అపరాధ రుసుం భారం లేకుండా ఉంటుంది. వాయిదాల ప్రకారం నిర్ణీత గడువులోగా చెల్లిస్తే తక్కువ వడ్డీ సదుపాయం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వడ్డీతో పాటు అపరాధ భారం రెండింతలు మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో సహకార అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉంది.


రైతుల వద్దకే సేవలు

మనోహర్‌రెడ్డి, ఛైర్మన్‌ డీసీసీబీ, ఉమ్మడి జిల్లా

సేవలను ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నాం. రైతుల చెంతకే తీసుకువెళ్లేందుకు మరింత కృషి చేస్తున్నాం. ఇతర బ్యాంకులతో పాటు పోటీపడుతున్నాం. నిబంధనలను సరళతరం చేస్తూ వారి మన్ననలు చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులపై అధిక వడ్డీ భారం పడకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆర్థిక అక్షరాస్యతపై చైతన్యం కల్పించి, వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు