logo

నిధే పెన్నిధి.. చేరానలి సన్నిధి!

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీన ప్రవేశపెట్టనున్న పద్దుపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Published : 04 Feb 2023 03:17 IST

బడ్జెట్‌పై జిల్లా వాసుల ఆశలు
న్యూస్‌టుడే, తాండూరు

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీన ప్రవేశపెట్టనున్న పద్దుపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సేద్యమే ప్రధాన ఆధారం కావడంతో జలాశయాల మరమ్మతుకు అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. విద్య, వైద్యం, తదితర రంగాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతాయని ఆశిస్తున్నారు.


వసతులు కల్పిస్తేనే పర్యాటకం

అనంతగిరి అడవులు 3,500 ఎకరాల్లో విస్తరించాయి. ఔషధ వృక్షాలతో కూడిన కొండలను సందర్శించేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పర్యాటకులు వచ్చి వెళుతుంటారు. ఇక్కడే కొలువు దీరిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటారు. దగ్గరిలో కోట్‌పల్లి జలాశయంలో బోటింగ్‌ నిర్వహిస్తారు. వారాంతపు రోజుల్లో వేల మంది వస్తారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు పీల్చే ప్రాణవాయువు చాలా స్వచ్ఛమైంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.  


కంది బోర్డు తప్పనిసరి

నాణ్యమైన కంది పంట సాగయ్యే తాండూరు కేంద్రంగా బోర్డు ఏర్పాటు చేయాలను ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. రెండు దశాబ్దాలుగా ఇదే విషయమై రైతులు కోరుతున్నారు. ఇది సాకారమైతే విత్తనాలు, ఎరువులకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. పొలంలో విత్తనాలు వేసిన నాటి నుంచి దిగుబడులు చేతికి అందే వరకు అధికారులు పర్యవేక్షిస్తారు. ఉత్పత్తులను కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడతారు. దీంతో గిట్టుబాటు ధర కంటే ఎక్కువ లభిస్తుంది. గత డిసెంబరులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయంగా కంది ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1.48 లక్షల ఎకరాల్లో కంది పంట సాగవుతోంది. ఇటీవల తాండూరు పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళతానని రైతులకు హామీ ఇచ్చారు.


చిరకాల కోరిక ‘పాలమూరు-రంగారెడ్డి’ 

తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల ప్రజల తాగు, సాగు నీటి ఎద్దడిని తీర్చే ప్రాజెక్టు ఇది. కృష్ణా నది నుంచి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు నీరు వస్తే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుంది. కోట్‌పల్లి జలాశయం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఆరుతడి పంటల సాగుకు ఎద్దడి ఉండదు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఏదుల, నర్సాపూరు ప్రాంత పొలాలకు నీరందించే ప్రాజెక్టు కరివేన, వట్టెం వద్ద పనులు పూర్తి కావస్తున్నాయి. ఉద్ధండాపూరు వద్ద ఇంకా పూర్తి కాలేదు. ఇవి పూర్తయితే ఆరు లక్షల ఎకరాల్లో, నాలుగు లక్షల వరకు ఆరుతడి పంటల సాగవుతాయి.


జలాశయాలకు..

జిల్లాలో 1,124 చెరువులు ఉన్నాయి. కోట్‌పల్లి, జుంటిపల్లి, లక్నాపూరు, సర్పన్‌పల్లి ప్రధాన జలాశయాలున్నాయి. ప్రభుత్వం నాలుగు విడతలుగా నిర్వహించిన మిషన్‌ కాకతీయ కింద చెరువులు బాగు పడ్డాయి. శిథిలమైన తూములు, కాలువల మరమ్మతు పూర్తయింది. ప్రధాన ప్రాజెక్టుల కాలువలు, తూములు మరమ్మతుకు నోచుకోవడం లేదు. జలాశయాల్లో నీరున్నా చివరి ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. మొత్తం 17,214 ఎకరాలకు కేవలం 7,500 ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. కోట్‌పల్లికి రూ.40 కోట్లు, జుంటిపల్లికి రూ.10 కోట్లు, సర్పన్‌పల్లికి రూ.5 కోట్లు, లక్నాపూరు జలాశయానికి మరో రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.60 కోట్లు కావాలి.


ట్రామా కేంద్రం అత్యవసరం

బీజాపూరు జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురయ్యే వారికి అత్యవసర చికిత్స అందించేందుకు తాండూరులో ట్రామా కేంద్రాన్ని ప్రారంభించారు. అవసరమైన వసతులు సమకూర్చేందుకు వైద్య విధానపరిషత్‌ రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఇవే నిధుల ఆధారంగా గదులను తీర్చిదిద్దారు. అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను సమకూర్చ లేదు. రహదారి ప్రమాదాలు జరిగి ఆసుపత్రికి వస్తున్న వారికి సాంత్వన కలిగించే చికిత్స జరగడం లేదు. హైదరాబాద్‌కు  పంపిస్తున్నారు. తాజాగా జిల్లా మీదుగా ఎన్‌హెచ్‌ 67(ఎన్‌) జాతీయ రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ట్రామా కేంద్రం ఏర్పాటుకు చొరవ చూపితే ప్రయోజనం ఉంటుంది.


జిల్లా కేంద్రానికి బాహ్యవలయ దారి

జిల్లా కేంద్రంగా ఉన్న వికారాబాద్‌ చుట్టూ బాహ్యవలయ రహదారి నిర్మాణం చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తాండూరు, పరిగి, సంగారెడ్డి, హైదరాబాద్‌ నుంచి వచ్చి పోయే భారీ వాహనాలు జిల్లా కేంద్రం మీదుగా వెళతాయి. ఇదే సమయంలో బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, పాఠశాలల బస్సులు వంటి వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు జిల్లా కేంద్రం వెలుపలి నుంచే వెళ్లేలా బాహ్యవలయ రహదారి నిర్మాణం కావాలి. పరిగి నియోజకవర్గం గండేడ్‌లో అధ్వానంగా ఉన్న రహదారుల మరమ్మతుకు నిధులు కావాలి. పరిగి నుంచి లాల్‌పహాడ్‌ రహదారిని అబివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని