logo

ఖాతాలో వేశారు.. ఖాళీ చేసేశారు!

అన్నదాతలకు సాగు సమయంలో అక్కరకు వచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బంధు సాయం అందిస్తోంది. ఈ మొత్తం వారి పొదుపు ఖాతాలో జమైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Published : 05 Feb 2023 03:47 IST

పాత బాకీ కింద  రైతు బంధు జమ

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: అన్నదాతలకు సాగు సమయంలో అక్కరకు వచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బంధు సాయం అందిస్తోంది. ఈ మొత్తం వారి పొదుపు ఖాతాలో జమైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ ఖాతా ఉన్నా సాయం వస్తుందన్న ఆశతో అనేకమంది రైతులు కేవలం పంట రుణం తీసుకున్న ఖాతానే కొనసాగిస్తున్నారు. రైతు బంధు సొమ్ము నేరుగా దీన్లో జమైతే బ్యాంక్‌ అధికారులు పాత బాకీల కింద జమ చేస్తున్నారు. విషయం తెలిసిన రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.  

పరిమితుల్లేకుండా ఏటా రూ.10 వేలు

జిల్లా వ్యాప్తంగా 2.36లక్షల మంది రైతులు భూముల్ని కలిగి ఉన్నారు. వీరంతా సాగు ఖర్చుల నిమిత్తం వడ్డీ వ్యాపారుల, దళారుల బారిన పడకుండా సర్కారే రైతు బంధు కింద ఆర్థికసాయం అందిస్తోంది. 2018-19లో ఎకరాకు రూ.4వేల చొప్పున ఇచ్చారు. 2019-20లో రూ.5వేలకు పెంచింది. ఎలాంటి పరిమితులు లేకుండా ఏటా ఎకరాకు రూ.10వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది.

* రైతుబంధు సొమ్మును ప్రస్తుతం కొందరు బ్యాంకర్లు పంట రుణాలకు, ఇతర కార్పొరేషన్‌, స్వయం సహాయక సంఘాల రుణాల కింద జమ చేసుకుంటున్నారు. తాండూరు, ధారూరు, బొంరాస్‌పేట మండలాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. గత్యంతరంలేక అడ్తి దుకాణదారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ప్రైవేటు రుణాలు పొందుతున్నారు.  

ఉదాహరణలు..

* తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన శాంతయ్యకు రైతు బంధు సొమ్ము ఎస్‌బీఐ ఖాతాలో జమైంది. నగదు పొందేందుకు వెళ్లగా పంట రుణం కింద జమ చేసుకున్నట్లు అధికారులు తెలపడంతో ఆయన బిక్కమొగం వేశారు.

* ధారూరు మండలం నాగసముందర్‌కు చెందిన నర్సింహులు రైతుబంధు సొమ్ము రూ.20వేలు ఖాతాలో పడింది. దాన్ని డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే పాత అప్పు కింద జమ చేసుకున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు. వెంటనే ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో వారు బ్యాంకర్లతో మాట్లాడి సొమ్ము తిరిగి అందించేలా చేశారు.


బ్యాంకర్లను ఆదేశించాం
- రాంబాబు, లీడ్‌ బ్యాంకు మేనేజరు

రైతు బంధు సొమ్మును పాత బాకీల కింద జమ చేయరాదని ఇప్పటికే జిల్లాలోని బ్యాంకర్లను ఆదేశించాం. ఈ  సొమ్ము జమ చేసేందుకు పంట రుణం ఖాతాలకు బదులు పొదుపు ఖాతా వివరాలను సమర్పించాలి. పంట రుణం ఖాతాలో రైతుబంధు జమైతే నేరుగా రుణం కింద వెళ్లిపోయే ఆస్కారముంటుంది. మా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని