logo

పనుల్లో వేగం.. రవాణా యోగం

భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పనులు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.

Published : 05 Feb 2023 03:47 IST

హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ షురూ

విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు  

న్యూస్‌టుడే, పూడూరు: భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పనులు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. వచ్చేది వేసవి కాలం కావడంతో పనుల నిర్వహణకు సమయం అనుకూలంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా రవాణా మరింత వేగంగా, సజావుగా సాగుతుందని వివరిస్తున్నారు.

ముందస్తుగా రూ.785 కోట్ల మంజూరు

అప్పా జంక్షన్‌ నుంచి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చేవెళ్ల మీదుగా వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ వరకు నాలుగు వరుసలు నిర్మాణం చేయనున్నారు. విస్తరణ చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావటంతో పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. పరిశీలించిన కేంద్రం గత ఏడాది చివరలో అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. 45 కిలో మీటర్ల విస్తరణ కోసం రూ.1,000 కోట్లు అవసరమని అంచనాలు వేస్తూ మంజూరుకు ప్రతిపాదించారు. ముందస్తుగా రూ.785 కోట్లు మంజూరు కావటంతో టెండర్‌ల ద్వారా ఓ ప్రైవేటు సంస్థ పనులు దక్కించుకుంది.

* విస్తరణలో భాగంగా ఇరువైపులా భూములు, ఆస్తులు కోల్పోతున్న వారి అంచనాలను రూపొందించిన అధికారులు ప్రక్రియను వేగవంతం చేసి పరిహారాన్ని ఇప్పటికే బాధితులకు అందించారు. వివిధ సర్వే పనులు ముమ్మరం చేశారు. హద్దులు ఏర్పాటు చేసి కడీలు పాతారు.

* మన జిల్లా సరిహద్దు అంగడిచిట్టంపల్లి గేటు నుంచి మన్నెగూడ వరకు సుమారు 4 కిలో మీటర్ల మేర చేపట్టనున్న విస్తరణలో భాగంగా ఇరుశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కండ్లపల్లి గేటువద్ద ఇరువైపులా అటవీశాఖ పరిధిలో ఉండటంతో ఇటీవల కేంద్రం నుంచి సంబంధిత అధికారి వచ్చి అటవీ విస్తీర్ణం ఎంత దూరం కోల్పోతున్నామనే విషయమై అంచనా వేశారు.

మర్రి వృక్షాల తొలగింపుపై స్పష్ట్టత లేదు

అంగడిచిట్టంపల్లి గేటు నుంచి మన్నెగూడ వైపు వేసిన హద్దుల ప్రకారం గుత్తేదారు పనులు ప్రారంభించారు. వివిధ రకాల చెట్లను కూడా తొలగిస్తున్నారు. ఏళ్లకాలం నాటి మర్రి ఇతర మహావృక్షాలు ఉండటంతో ఓ స్వచ్ఛంద సంస్థ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌) జాతీయ హరిత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అక్కడి నుంచి దీనిపై ఇంకా స్పష్టత రాకపోవటంతో అధికారులు ఈ వృక్షాలను కదిలించేందుకు ప్రయత్నం చేయటం లేదు.  


అదనపు నిధులు రావాల్సి ఉంది
- శరత్‌, జాతీయ రహదారుల సంస్థ అధికారి

అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు చేపట్టనున్న భారీ ప్రాజెక్టు కావటంతో సమయం పడుతుంది. అదనంగా నిధులు రావాల్సి ఉంది. కండ్లపల్లి సమీపంలో అటవీశాఖ పరిధి నుంచి అనుమతులు వచ్చాయి. మర్రి వృక్షాల తొలగింపుపై ఇంకా కోర్టు నుంచి ఆదేశాలు రాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని