logo

జైల్లో స్నేహితులయ్యారు.. బయటకొచ్చి ట్రాక్టర్ల దొంగలుగా మారారు

వివిధ నేరాలు చేసి జైలుకెళ్లిన ముగ్గురు అక్కడ స్నేహితులయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి వాహన చోరీలకు పాల్పడుతున్నారు.

Published : 05 Feb 2023 03:27 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: వివిధ నేరాలు చేసి జైలుకెళ్లిన ముగ్గురు అక్కడ స్నేహితులయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి వాహన చోరీలకు పాల్పడుతున్నారు. ట్రాక్టర్లను దొంగిలించిన ఈ ముఠాను శంకర్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ ఠాణాలో విలేకరుల సమావేశంలో జోన్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర లాతూర్‌ జిల్లాకు చెందిన ముజాహిద్‌ సయ్యద్‌ మహ్మద్‌ అలియాస్‌ ముజ్జు(24), జమీర్‌దిల్వార్‌ షేక్‌(26), కర్ణాటక  బీదర్‌కు చెందిన జమదార్‌ శ్యామ్‌ అలియాస్‌ రాజు(23) లాతూర్‌ సబ్‌ జైలులో స్నేహితులయ్యారు. విడుదలయ్యాక ముజాహిద్‌ సయ్యద్‌ అహ్మద్‌ నేతృత్వంలో ముఠాగా ఏర్పడ్డారు. రాత్రివేళ బైక్‌పై తిరుగుతూ కాలనీల్లో వాహన చోరీలకు పాల్పడేవారు. గత నవంబరు 27న  శంకర్‌పల్లి ఠాణా పరిధిలోని సింగాపురంలో చాకలి పాండు తన ఇంటికి సమీపంలో ఉంచిన ట్రాక్టర్‌ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించి.. దొంగిలించిన ట్రాక్టర్‌ను తీసుకెళ్లిన ప్రాంతాలను పరిశీలిస్తూ లాతూర్‌ వరకు వెళ్లారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా, ఇదే తరహాలో సంగారెడ్డిలోని కోహీర్‌, సదాశివపేట ఠాణా పరిధిలోనూ రెండు ట్రాక్టర్లనూ చోరీ చేసినట్లు అంగీకరించారు.

నార్సింగి ఠాణా పరిధిలో..  నార్సింగి ఠాణా పరిధిలో ఇంటి ముందు పార్క్‌ చేసిన ట్రాక్టర్‌ను మరో ఇద్దరు దొంగిలించినట్లు డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. డిసెంబరు 31 రాత్రి గంగాధర్‌రెడ్డి  కోకాపేట్‌లోని తక్షయ అపార్ట్‌మెంట్‌ సమీపంలో పార్క్‌ చేశారు. మహారాష్ట్ర పుణేకు చెందిన రాజేష్‌ విఠల్‌ (48) మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌లో, నాందేడ్‌కు చెందిన జె.ప్రకాష్‌(27) నానక్‌రాంగూడలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ స్నేహితులయ్యారు. కోకాపేట్‌లోని ట్రాక్టర్‌ను అపహరించారు. పోలీసులు గుర్తించి అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని