logo

చెరువు గట్టున.. నిఘాతో రక్షణ

నగరంలో చెరువులను రక్షించేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. తటాకాల చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది.

Updated : 05 Feb 2023 04:53 IST

1170 సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం
ఆక్రమణలను అడ్డుకుంటామన్న జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో చెరువులను రక్షించేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. తటాకాల చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఆ మేరకు ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానిస్తూ బల్దియా ఇంజినీరింగ్‌ విభాగం గతనెల 28న వారం గడువుతో టెండర్లు ఆహ్వానించింది. దూరం నుంచి కూడా దృశ్యాన్ని స్పష్టంగా రికార్డు చేసే కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని 4జీ లేదా 5జీ సిమ్‌కార్డులతో అనుసంధానం చేసి రెండేళ్లు మెరుగ్గా నిర్వహించాలని షరతు పెట్టింది. ఏదేని చెరువు ఆక్రమణకు గురైనా, నిర్మాణ వ్యర్థాలతో నిండినా.. ఆయా సీసీ కెమెరాల్లో దృశ్యాలు పరిశీలించి, బాధ్యులను గుర్తిస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. పోలీస్‌ కేసు నమోదుకు కూడా సీసీ కెమెరాల దృశ్యాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని వెల్లడించారు.

152 తటాకాల చెంత..  ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో.. బస్తీలు, డివిజన్లు, నియోజకవర్గ స్థాయిలో కొందరు నేతలు చెరువులపై కన్నేశారు. రాత్రికి రాత్రే నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. గదులు నిర్మించి అమాయకులకు అమ్మేస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట, బాలాజీనగర్‌, అల్వాల్‌, ఓల్డ్‌ బోయినపల్లి డివిజన్లలో జోరుగా చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌ జోన్లలోనూ అదే తంతు. జీహెచ్‌ఎంసీ అధికారులనూ ఆక్రమణదారులు ఖాతరు చేయట్లేదు. ఈ ఉదంతాలపై ఆధారాలతో, వేర్వేరు చెరువుల ఆక్రమణలపై కొంత కాలంగా ‘ఈనాడు’ పలు కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నీటిపారుదల విభాగం తటాకాల సంరక్షణకు సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 152 జల వనరులను ఎంపిక చేశామని, చెరువుల్లోకి వెళ్లే రోడ్లపై, ఎఫ్‌టీఎల్‌ సరిహద్దు చుట్టూ స్తంభాలు పాతి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ముఖ్య ఇంజినీరు సురేష్‌కుమార్‌ తెలిపారు. 1920*1080 పిక్సెల్‌ నాణ్యతతో దృశ్యాలను రికార్డు చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలని గుత్తేదారులకు సూచించామన్నారు. చెరువుల వారీగా సీసీ కెమెరాల ఫుటేజీని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి, అవసరమైనప్పుడు పరిశీలించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు