logo

కోడ్‌.. కుర్ర మనసు గెలిచెన్‌

పుస్తక పఠనం విజ్ఞానంతోపాటు వికాసానికి దోహదం చేస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించేలా చేస్తుంది. అయితే ఈతరం పుస్తకాలు చదవడమే తగ్గిపోయిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Published : 05 Feb 2023 04:19 IST

వీడియోలతో ఆకట్టుకునేలా పుస్తకాల్లో సాంకేతికత

ఈనాడు, హైదరాబాద్‌: పుస్తక పఠనం విజ్ఞానంతోపాటు వికాసానికి దోహదం చేస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించేలా చేస్తుంది. అయితే ఈతరం పుస్తకాలు చదవడమే తగ్గిపోయిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అందునా మొబైల్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వచ్చాక గంటల తరబడి వాటిలోనే గడిపేస్తుండటంతో చదవడం అనేది మరింత తగ్గిపోయిందనేది అధ్యయనాలు చెబుతున్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం పెంపొందించేందుకు రచయితలు, ప్రచురణకర్తలు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి క్రమంగా సత్ఫలితాలు ఇస్తున్నాయి.


ఆంగ్ల పుస్తకాల్లో ప్రయోగాలు

అచ్చు రూపంలో ఉన్న పుస్తకాలు ఇప్పటికీ పెద్దఎత్తున ప్రచురితం అవుతున్నాయి. వీటిని ఎంతమంది చదువుతున్నారంటే చెప్పడం కష్టమే. పాఠకులకు చేరువయ్యేందుకు ఆంగ్లంలో వస్తున్న పుస్తకాల్లో ఎప్పటిప్పుడు మార్పులు చేస్తున్నారు. మొబైల్‌, ఇతర గాడ్జెట్స్‌లో కూడా చదువుకునేలా ఏర్పాట్లు ఉంటున్నాయి. పుస్తకంలో ప్రతి భాగం తర్వాత క్యూఆర్‌ కోడ్‌ ముద్రిస్తున్నారు. తద్వారా కొత్త తరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పుస్తకంలో ఒక భాగం, ఒక కథనం చదివాక క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే మరింత సమాచారం పొందడమే కాదు వీడియోలూ కనిపిస్తాయి. ఎవరిదైనా జీవిత కథ రాస్తే రచయిత వారితో నేరుగా మాట్లాడిన విషయాలను వీడియోలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. పూర్తిగా చదవలేని వారు వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అకడమిక్‌ పుస్తకాల్లోనూ ఈ తరహా ఏర్పాట్లుంటున్నాయి. బహు భాషల్లోనూ వస్తున్నాయి.


తెలుగులో అడుగులు నెమ్మదిగా

ఆంగ్ల పుస్తకాల్లో ఎక్కువగా ఈ తరహా ప్రయోగాలు కన్పిస్తున్నా తెలుగులో మాత్రం పెద్దగా మార్పులు కన్పించడం లేదు. ఫొటోలు ముద్రించి, రంగుల్లో ప్రచురిస్తున్నా అంతకుమించి పాఠకులు కోరుకుంటున్నారు అన్పిస్తోంది. ముద్రించే కాగితం సైతం మారాల్సి ఉంటుంది. ఆంగ్ల పుస్తకాలతో పోలిస్తే మన పుస్తకాలు చాలా తేలికగా ఉంటాయి.


ఆసక్తికర అంశాలుంటేనే..

పుస్తకంలో ఆసక్తికర అంశాలు ఉంటేనే పాఠకులను చదివించగల్గుతాయి. అందుకే పుస్తకంలో ఏముందో తెలిసేలా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. అంశాలు పూర్తిగా ఉండకపోయినా సారాంశం చదివి నచ్చితే కొనుగోలు చేసి చదువుకోవచ్చు. ఆన్‌లైన్‌ గ్రంథాలయాల్లో ఉచితంగా చదువుకునే పుస్తకాలు సైతం పెద్దఎత్తున అందుబాటులో ఉంచుతున్నారు.


60 సార్లు పునర్‌ ముద్రణ
- పాలగుమ్మి సాయినాథ్‌, ప్రముఖ పాత్రికేయులు

ఆకట్టుకునేలా, కదిలించగల్గేలా రాయగలిగితే ఇప్పటికీ పుస్తకాలకు ఆదరణ ఉంటుంది. నేను 1998లో రాసిన ‘ఎవ్రీబడీ లవ్స్‌ ఎ గుడ్‌ డ్రాట్‌’ ఇప్పటికి 60 సార్లు పునర్‌ ముద్రణ అయ్యింది. ప్రతి చాప్టర్‌ తర్వాత క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే రచన నేపథ్యం, వీడియోలు, ఇంటర్వ్యూలు ఉండేలా నా పుస్తకాల్లో ప్రచుకరణకర్తలు ఈ ప్రయోగాలు చేశారు.


ఎక్కువ మందికి చేరాలని
- అపర్ణ తోట, ‘పూర్ణ’ పుస్తక రచయిత

నేను మొదట తెలుగులో పుస్తకం రాయాలని భావించినా ఎక్కువ మందికి చేరాలని ఆంగ్లంలో, సరళమైన భాషలో రాశాను. పుస్తకం అంటే ఇలాగే ఉండాలనే నియమం పెట్టుకోలేదు. మూడు భాగాలుగా విభజించి ‘పూర్ణ’ సాహసగాథను అచ్చురూపంలో పెట్టాను. స్ఫూర్తి పొంది భవిష్యత్తులో ఎవరైనా పర్వతారోహణకు వెళ్లాలనుకుంటే వారికి ఉపయోగపడేలా అన్ని అంశాలను జోడించాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు