logo

విన్నపాలు వినాలి.. పరిష్కారాలు చూపాలి

కలెక్టర్‌ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం జరుగనుంది. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా పరిష్కరించడమే ప్రజావాణి లక్ష్యం. 

Published : 06 Feb 2023 00:52 IST

కొత్త కలెక్టర్‌పై ప్రజల ఆశలు
నేడు ప్రజావాణి

న్యూస్‌టుడే వికారాబాద్‌: కలెక్టర్‌ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం జరుగనుంది. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా పరిష్కరించడమే ప్రజావాణి లక్ష్యం.  కొంత కాలంగా మొక్కుబడి తంతుగా మారి ప్రజల గోడు వినేవారు లేకపోయారు. ఈ నేపథ్యంలో కష్టం విలువ తెలిసిన సి.నారాయణరెడ్డి ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ప్రజలకు కలెక్టర్‌ నియామకానికి సంబంధించిన సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడం, నిజామాబాద్‌ కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలను పరిగణలోకి తీసుకొని సానుకూలంగా స్పందిస్తారన్న ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.  


కొన్ని ఉదాహరణలు..

* వికారాబాద్‌ మండలం మైలార్‌దేవరంపల్లికి చెందిన ఈశ్వరమ్మ భర్త పెద్ద అంజయ్య పేరిట సర్వే నం.92లో 1.32 ఎకరాలు, సర్వే నం.93లో 2.09 ఎకరాల పొలం ఉంది. ఆమె భర్త 2021 జనవరిలో మృతి చెందాడు. భర్త పేరిట ఉన్న భూమిని తన పేరిట పట్టా మార్పిడి చేయడానికి మీ సేవలో రూ.6,800 చెల్లించినా తిరస్కరించారు. మళ్లీ చెల్లించినా కారణం చెప్పకుండానే తిరస్కరణకు గురైంది.

* వికారాబాద్‌ పట్టణంలోని గంగారం గ్రామానికి చెందిన జ్యోతికి భూమి సర్వే నం.3లో ఎకరా పొలం ఉంది. ఈమె కుటుంబ సభ్యుల పేరిట కూడా అదే సర్వే నంబరులో 3.04 ఎకరాల పొలం ఉంది. వీరి సాగు భూమిని రెవెన్యూ అధికారులు దేవాదాయ శాఖకు చెందినట్లుగా చేర్చారు. తిరిగి పట్టా భూమిగా నమోదు చేయాలని పలుమార్లు కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి సమస్యను విన్నవించారు.


నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు.

* వికారాబాద్‌ మండలం పాతూరుకు చెందిన వడ్డె లక్ష్మి తండ్రి చెన్నయ్య పేరిట సర్వే నం117లో 3.21 ఎకరాల పొలం ఉంది. తండ్రి 2007లో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు. పట్టా మార్పిడి కోసం మీ సేవలో రూ.11,400 చెల్లించగా, దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఇలా మూడుసార్లు మీ సేవలో రూ.34,200 చెల్లించినా పట్టా మార్పిడి కాలేదు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు మీ సేవలో రుసుము చెల్లించడానికి ఇతరుల దగ్గర చేసిన అప్పులు తీర్చడానికి అగచాట్లు పడుతున్నారు.  


ధరణితో వీడని చిక్కుముడులు..

ధరణితో ఇంకా చిక్కుముడులు వీడటం లేదు. జిల్లా వ్యాప్తంగా 6,845 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. భూముల క్రయవిక్రయాలతో పాటు దస్త్రాల నవీకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అత్యంత సాంకేతికతతో కూడిన ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల అనేక అంశాల్లో చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రధానంగా డిజిటల్‌ పట్టాదారు పాసుపుస్తకంలో ఏ చిన్న తప్పు దొర్లినా సవరించుకునే అవకాశం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని