logo

వారి త్యాగం..వేరొకరికి కొత్త జీవితం!

28 ఏళ్ల యువతి... రెండు మూత్ర పిండాలు పాడయ్యాయి.  పదేళ్లుగా డయాలసిస్‌ చేసుకుంటూ నరకం అనుభవిస్తోంది. 

Updated : 06 Feb 2023 04:49 IST

అవయవదానంలో మనమే ముందు
ఏటా పెరుగుతున్న అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌: 28 ఏళ్ల యువతి... రెండు మూత్ర పిండాలు పాడయ్యాయి.  పదేళ్లుగా డయాలసిస్‌ చేసుకుంటూ నరకం అనుభవిస్తోంది.  చివరి ప్రయత్నంగా కిడ్నీ ఇచ్చే దాత కోసం జీవన్‌దాన్‌ ట్రస్టులో రిజిస్టర్‌ చేసుకుంది. తన వంతు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఇంతలోనే ఆసుపత్రి నుంచి సమాచారం. ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో వారి కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు కిడ్నీ సేకరించి మీకు అమర్చనున్నట్లు చెప్పారు. ఈ విషయం తెలియగానే.. ఆశలు చిగురించాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె మోములో సంతోషం. ఇటీవలే ఆమెకు విజయవంతంగా నిమ్స్‌లో కిడ్నీ మార్పిడి చేశారు. ఓ దాత త్యాగం ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది.. ఇలా ఒకరా ఇద్దరా ఎంతోమంది... పునర్జన్మ పొందుతున్నారు.  కిడ్నీలు పాడై కొందరు... కాలేయం చెడిపోయి  మరికొందరు... బతుకీడుస్తూ... మృత్యువు వరకు వెళ్లిన చాలామందికి అవయవదానం కార్యక్రమం అండగా నిలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమంలో తెలంగాణనే ముందు ఉండటం గమనార్హం. పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో కేంద్రం ఈ విషయం స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. కరోనాలో మందగించినా సరే... తర్వాత మళ్లీ పుంజుకోవడం విశేషం. గతేడాది దేశంలోనే భాగ్యనగరం కేంద్రంగా 194 అవయవదానాలు జరిగాయి. నగరం వైద్య సేవలకు హబ్‌గా మారడంతో ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఇక్కడ అందుబాటులోకి వస్తున్నాయి. అవయవదానం పెరగడానికి ఇది ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇంకా పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


సర్కారు దవాఖానాలు దిగదుడుపే..

అవయవదానాల్లో ప్రభుత్వాసుపత్రుల కంటే కార్పొరేట్‌ వైద్యశాలలు ముందుంటున్నాయి. నిమ్స్‌లో 2013 నుంచి ఇప్పటివరకు కేవలం 24, ఉస్మానియాలో 08, గాంధీలో ఒక్క దానం కూడా చేయలేదు. గాంధీలో నిర్మిస్తున్న అవయవదాన కేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రైవేటులో మాత్రమే ఎక్కువ అవయవదానాలు, అవయవాల మార్పిడిలు నిర్వహిస్తున్నారు.


ఎంతోమంది ఎదురుచూపు

మొత్తం 11,749 మంది జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగా. ఇందులో కిడ్నీలు కోసం 5824 మంది, మరో 5303 మంది కాలేయాల కోసం నిరీక్షిస్తున్నారు. అవగాహన పెరిగితే.. ఎన్నో జీవితాలు కాపాడవచ్చని ట్రస్టు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ స్వర్ణలత అన్నారు.

ఆసుపత్రుల వారీగా జరిగిన దానాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని