logo

మెట్రోకు మూసీ కాలుష్య కాటు

మెట్రోరైళ్లలో తరచూ సాంకేతికత సమస్యలు తలెత్తడానికి కాలుష్యమే కారణమా? మెట్రో నెట్‌వర్క్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు కాలుష్యంతో మొరాయిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి మెట్రో వర్గాలు.

Published : 06 Feb 2023 03:57 IST

ఉప్పల్‌లో డిపో ఏర్పాటుపై మధనపడుతున్న సంస్థ అధికారులు

నాగోల్‌లో మూసీ ప్రవాహం.. పక్కనే ఉప్పల్‌ మెట్రో డిపో

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైళ్లలో తరచూ సాంకేతికత సమస్యలు తలెత్తడానికి కాలుష్యమే కారణమా? మెట్రో నెట్‌వర్క్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు కాలుష్యంతో మొరాయిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి మెట్రో వర్గాలు. నాగోల్‌లో మూసీ ఒడ్డున 100 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఉప్పల్‌ మెట్రోరైలు డిపో ఏర్పాటు చేశారు. ఇక్కడ డిపో ఏర్పాటు చేసి పొరపాటు చేశామా అని మొదటిసారి అధికారులు మధనపడుతున్నారు. అంతగా మెట్రోనెట్‌వర్క్‌ను కాలుష్యం వణికిస్తోంది. మెట్రోని నిర్వహిస్తున్న కియోలిస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. 3 నెలల్లో ముఖ్యంగా చలికాలంలో పలుమార్లు రైళ్లు మొరాయించాయి. సిగ్నలింగ్‌లో సమస్యలు తలెత్తాయి. సాంకేతికతను అందించిన విదేశీ నిపుణులతోనూ ఎప్పటికప్పుడు మెట్రో ఇంజినీర్లు సంప్రదింపులు జరుపుతున్నారు.

బహిరంగ వ్యవస్థలతోనే..  మెట్రోరైళ్లను ఆటోమెటిక్‌ ట్రైన్‌ ఆపరేషన్‌(ఏటీవో) పద్ధతిలో నడుపుతున్నారు. ఈ విధానంలో రైలు తనంతటతానే పరుగులు తీస్తూ తన గమనాన్ని, వేగాన్ని నియంత్రించుకుంటుంది. డ్రైవర్‌ కేవలం స్టేషన్‌లో ప్రయాణికులను గమనిస్తూ మెట్రో తలుపులు మూసే బటన్‌ నొక్కడమే. భద్రత రీత్యా ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌(ఏటీపీ) వ్యవస్థ నిరంతరం మెట్రోని పర్యవేక్షిస్తుంది. కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌(సీబీటీసీ)తో నడుస్తుంది. ఫ్రాన్స్‌కు చెందిన థాలెస్‌ కంపెనీ హైదరాబాద్‌ మెట్రోకు ఈ సాంకేతికతను అందించింది. రేడియో సమాచార ఆధారిత వ్యవస్థ ఇది. ఏటీవో, ఏటీపీతోపాటు ఆటోమెటిక్‌ ట్రైన్‌ సూపర్‌విజన్‌, జోన్‌ కంట్రోలర్‌, డాటా కమ్యూనికేషన్‌ వ్యవస్థ వంటి అనేక ఉప వ్యవస్థలు పర్యవేక్షిస్తాయి. ఈ ప్రక్రియ ఉప్పల్‌ డిపోలోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ) నియంత్రిస్తుంది. చాలామంది మెట్రోలో ప్రయాణిస్తుండటంతో వాహనాల నుంచి వెలువడే కాలుష్యం నెట్రోజన్‌ డైయాక్సైడ్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ శాతం తగ్గింది.


కవర్‌ చేస్తామన్నారు..

ఉప్పల్‌, మియాపూర్‌లో డిపోలు నిర్మించారు. నాగోల్‌-రాయదుర్గంతోపాటు జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో నడిచే 30 వరకు రైళ్లు ఉప్పల్‌ డిపోలోనే ఉంటాయి. దీని పక్కనే మూసీ ప్రవహిస్తుంది. కొందరు రాత్రిపూట కాలుష్య వ్యర్థాలను మూసీలో పారబోస్తున్నారు. ఘాటు వాసనలు వస్తున్నాయని మెట్రో అధికారులు అంటున్నారు. సున్నిత పరికరాలు దెబ్బతినకుండా కవర్‌ చేయడం, అదనపు పెయింట్‌ వేస్తామని గతంలో చెప్పినా ఆచరణలో విఫలమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు