logo

రెడీమిక్స్‌ లారీ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి

రెడీమిక్స్‌ లారీ ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి చెందిన సంఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది.

Published : 06 Feb 2023 03:57 IST

రోహిత్‌రెడ్డి

కాప్రా, న్యూస్‌టుడే: రెడీమిక్స్‌ లారీ ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి చెందిన సంఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ ఎం.ప్రసాద్‌ వివరాల ప్రకారం.. కాప్రా సర్కిల్‌ పరిధి చిన్న చర్లపల్లిలోని సిల్వర్‌ ఓక్‌ విల్లాస్‌ కాలనీలో నివసించే ఈదర ప్రభాకర్‌రెడ్డి, సుశీల దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. వారి పెద్ద కుమారుడు రాహుల్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. చిన్న కొడుకు రోహిత్‌రెడ్డి(22) దుండిగల్‌లోని ఏరోనాటిక్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక తాను కూడా సోదరుడి వద్దకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. శనివారం ఎల్బీనగర్‌లో ఉంటున్న తన పిన్ని సారమ్మ ఇంటికి వెళ్లిన రోహిత్‌రెడ్డి.. రాత్రి పది గంటల సమయంలో చిన్న చర్లపల్లికి ద్విచక్రవాహనంపై తిరిగి బయల్దేరాడు. మార్గమధ్యలోని చర్లపల్లి పేజ్‌-4 పారిశ్రామికవాడలోని లింక్‌వెల్‌ కంపెనీ వద్దకు రాగా.. రాంపల్లి వైపు నుంచి ఈసీఐఎల్‌ వైపు వస్తోన్న రెడీమిక్స్‌ లారీ ఢీకొట్టంతో ద్విచక్రవాహనంపై నుంచి కిందపడ్డాడు. అతడి తల, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే రోహిత్‌ను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. రెడీమిక్స్‌ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.


చికిత్స పొందుతూ మరో విద్యార్థి..

వనస్థలిపురం, న్యూస్‌టుడే: రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతిచెందిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చంపాపేట వైశాలినగర్‌ కాలనీలో నివాసముంటున్న ముఖిద్‌ పటేల్‌(20) ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్లి తిరిగి చంపాపేటకు వస్తున్నాడు. బీఎన్‌రెడ్డినగర్‌ దాటిన తర్వాత పెట్రోల్‌ బంకు సమీపంలో ముందు నుంచి అపసవ్య దిశలో వచ్చిన కారు ఢీ కొట్టింది. రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఆదివారం సాయంత్రం  మృతిచెందాడు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు