logo

ఆర్థిక శక్తి, ప్రజారోగ్యం దేశాభివృద్ధిలో కీలకం

ఆరోగ్యవంతమైన దేశమే ఆర్థికవృద్ధిని వేగంగా సాధిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 03:57 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ట్రస్ట్‌ సేవలపై శిక్షణార్థులతో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు

శంషాబాద్‌,న్యూస్‌టుడే: ఆరోగ్యవంతమైన దేశమే ఆర్థికవృద్ధిని వేగంగా సాధిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. ప్రతి ఒక్కరి దినచర్యలో యోగా, నడక, వ్యాయామం భాగం కావాలన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో ఆదివారం కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. శివారు గ్రామాలకు చెందిన 500 మందికి ఆరోగ్య పరీక్షలు చేసి అన్నదానం చేశారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వివిధ నైపుణ్య రంగాల్లో శిక్షణ పొందిన 180 మంది నిరుద్యోగులకు ధ్రువీకరణ పత్రాలే అందజేసి అభినందించారు. ఆర్థిక శక్తితోపాటు ఆరోగ్య శక్తి కూడ దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. విదేశీ ఆహార అలవాట్లకు స్వస్తిపలికి భారతీయ ఆహారంపై దృష్టి సారించాలన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మన పెద్దలు కాలానుగుణంగా చూపించిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సి ఉందన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యరశ్మి, పచ్చదనం, వ్యాయామం, ఆహార క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మిత్రులు.. ఈ ఆరింటికి ప్రాధాన్యత ఇస్తే వైద్యం అవసరం ఉండదన్నారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, కిమ్స్‌ ఛైర్మన్‌ భాస్కర్‌రావు, వంశీరాం బిల్డర్స్‌ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని