logo

రాజధాని పోలీసింగ్‌కు రూ.252 కోట్లు

బడ్జెట్‌లో రాజధాని పోలీసు విభాగానికి భారీగానే నిధులు దక్కాయి. మొత్తం 3 కమిషనరేట్లకు కలిపి ప్రభుత్వం ప్రగతి పద్దు కింద 252.18 కోట్లు కేటాయించింది.

Published : 07 Feb 2023 04:06 IST

హైదరాబాద్‌లో సీసీ కెమెరాల  ఏర్పాటుకు రూ.వంద కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: బడ్జెట్‌లో రాజధాని పోలీసు విభాగానికి భారీగానే నిధులు దక్కాయి. మొత్తం 3 కమిషనరేట్లకు కలిపి ప్రభుత్వం ప్రగతి పద్దు కింద 252.18 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే 9.62 కోట్లు అదనం. సీసీ కెమెరాల ఏర్పాటు, నూతన పోలీస్‌స్టేషన్ల నిర్మాణం, కమ్యూనిటీ పోలీసింగ్‌, సేఫ్‌సిటీ ప్రాజెక్టు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సేవలు, మహిళలు, చిన్నారుల సంరక్షణ, పరిపాలన, ట్రాఫిక్‌ నిర్వహణ, గణేశ్‌ నిమజ్జనం, ఇతర పండుగల బందోబస్తు తదితర వ్యయాల కోసం ఈ నిధులు ప్రతిపాదించారు. అత్యధికంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించడం విశేషం. గతేడాది రూ.43.01 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా అధికం. కొత్త ఠాణాలు, ఇతర భవనాల నిర్మాణాలకు రూ.8.59 కోట్లు ప్రతిపాదించారు. గణేశ్‌ నిమజ్జనం, పండగల సందర్భంగా బందోబస్తు కోసం గతేడాదితో పోలిస్తే ఈసారి 2 కోట్లు పెంచారు. రాచకొండ కమిషరేట్‌కు గత బడ్జెట్‌లో రూ.కోటి ప్రతిపాదించగా పైసా రాకపోగా ఈసారి కేవలం భవన నిర్మాణానికి రూ.లక్ష కేటాయించింది. కమిషరేట్‌ ఏర్పాటై ఏడేళ్లవుతుండగా మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో కొనసాగుతోంది. శాశ్వత భవనం కోసం మేడిపల్లిలో శంకుస్థాపన చేశారు. ప్రహరీ నిర్మించినా ఆ తర్వాత ఒక్క అడుగూ ముందుకు పడలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు