logo

నేర వార్తలు

చరవాణి చూడొద్దని తల్లి మందలించినందుకు కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

Published : 07 Feb 2023 04:06 IST

చరవాణి చూడొద్దని మందలించినందుకు ఆత్మహత్య

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: చరవాణి చూడొద్దని తల్లి మందలించినందుకు కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాంనారాయణ వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం 20 ఏళ్ల కిత్రం వచ్చి కొంపల్లి పురపాలిక పరిధి దూలపల్లిలో నివసిస్తోంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె. తండ్రి గేటెడ్‌ కమ్యూనిటీలో కాపలాదారు. తల్లి ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తోంది. కుమార్తె (17) పదివి ఓ పాఠశాలలో టీచర్‌గా చేస్తోంది. తరచూ చరవాణి చూసేది. ఆదివారం రాత్రి తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై పడక గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.


ట్రాక్టర్‌-ఆటో ఢీ.. ముగ్గురి మృతి

మాడ్గుల, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లి తానేసాహెబ్‌ గుట్ట సమీపంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ట్రాక్టర్‌, ఆటోను ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. మాడ్గుల సీఐ కృష్ణమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లులో నిశ్చితార్థంలో పాల్గొని సండ్రలగడ్డతండాకు ఆటోలో ఐదుగురు వెళ్తున్నారు. చంద్రాయన్‌పల్లి నుంచి పత్తిలోడుతో ట్రాక్టర్‌ ఆమనగల్లు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆమనగల్లు పరిధి నుచ్చుగుంట తండాకు చెందిన వర్తియావత్‌ శాంతి(40), సండ్రలగడ్డతండాకు చెందిన నేనావత్‌ పంతు (35) అక్కడికక్కడే మృతి చెందారు. బాలుడు అభి(6)ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గాయపడిన నుచ్చుగుంట తండాకు చెందిన వర్తియావత్‌ బిక్కు, సండ్రలగడ్డకు చెందిన నేనావత్‌ శారదలను ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి  తరలించారు. బిక్కు పరిస్థితి విషమంగా ఉందన్నారు.


ఒకే వాహనం.. పలు రుణాలు
20 ఏళ్ల తర్వాత ముగ్గురికి జైలుశిక్ష

నారాయణగూడ, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలతో ఒకే వాహనంపై పలు దఫాలుగా రుణాలు తీసుకుంటూ బ్యాంకులను మోసగించిన ముగ్గురికి జైలుశిక్ష పడింది. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి వివరాల ప్రకారం.. 2003లో రాంకోఠికి చెందిన వ్యాపారి రమేష్‌కుమార్‌ మిత్తల్‌ (55) నారాయణగూడకు చెందిన అజయ్‌ మోటార్స్‌ యజమాని పదం కుమార్‌జైన్‌ (45) నుంచి లోన్‌ తీసుకొని రూ.8.50 లక్షల టొయోటా క్వాలిస్‌ కారును బషీర్‌బాగ్‌ షోరూమ్‌ నుంచి కొనుగోలు చేశారు. పదంకుమార్‌ జైన్‌, రాంకోఠి నివాసి మహేష్‌ అగర్వాల్‌కు హుస్సెనీఆలం, మూసాబౌలిలో ఉండే ఆర్టీఏ బ్రోకర్‌ మీనాక్షి ప్రసాద్‌ శర్మ పరిచయం ఉండటంతో అతని సహాయంతో అదే కారుకి నకిలీ ఇన్‌వాయిస్‌ తయారు చేయించి 9 వేర్వేరు పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. తర్వాత రమేష్‌కుమార్‌ మిత్తల్‌ వివిధ ఫైనాన్షియర్లు, ప్రముఖ కార్పొరేట్‌ బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలో హిమాయత్‌నగర్‌లోని రిద్ధీ ఆటోమొబైల్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.6.22 లక్షలు తీసుకున్నాడు. ఈ రుణాలకు సంబంధించిన లాల్‌దర్వాజకు చెందిన వ్యాపారి వై.కిషోర్‌ అగర్వాల్‌ హామీదారు. వాయిదాలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ యజమాని నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దాదాపు 20 ఏళ్ల తరువాత మిత్తల్‌, కిషోర్‌ అగర్వాల్‌కు 7 ఏళు,్ల మిగతావారికి 3, 2 ఏళ్లు చొప్పున శిక్ష పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని