logo

Hyderabad: దారికొదిలేశారు!

రాజధాని మంగళవారం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంది. కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించడంతో గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపైనే ఉండిపోవాల్సి వచ్చింది.

Updated : 08 Feb 2023 11:12 IST

కిలోమీటరు దూరం.. అరగంట ప్రయాణం
ఈ-రేసింగ్‌ నేపథ్యంలో రోడ్ల మూసివేతతో ట్రాఫిక్‌ నరకం
ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌

ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌ వద్ద బారులుతీరిన వాహనాలు

రాజధాని మంగళవారం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంది. కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించడంతో గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 11వ తేదీన ఫార్ములా ఈ-రేసింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి వెళ్లే ఖైరతాబాద్‌ ఫ్లైËఓవర్‌తోపాటు ఇతర మార్గాలను మూసి వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా వందలాది వాహనాలు రోడ్లపైనే ఉండిపోవడంతో అటు సికింద్రాబాద్‌, బేగంపేట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, అబిడ్స్‌లాంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో కిలోమీటరు దూరం ప్రయాణించడానికి దాదాపు అరగంట సమయం పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.  ట్రాఫిక్‌ పోలీసులు ముందస్తు వ్యూహం లేకుండా ఎన్టీఆర్‌మార్గ్‌ చుట్టూ వాహనాలన్నింటిని నిలిపి వేయడంతో వాహనదారులు నరకాన్ని చూడాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో కొన్ని చోట్ల వాహనాదారులు రోడ్ల మీదే ఆందోళన చేయడానికి కూడా సిద్ధపడ్డారు.

చక్రబంధంలో ఖైరతాబాద్‌ బస్తీలు..

ఖైరతాబాద్‌ ప్రాంతంలో బస్తీల నుంచి ఖైరతాబాద్‌ ప్రధాన రహదారికి వెళ్లాలంటే రైల్వే గేటు ఉంది. ఈ గేటు సమీపంలో నివాసం ఉండే వారు మింట్‌కాంపౌండ్‌, నెక్లెస్‌ రోటరీ, ఫ్లైఓవర్‌ మీదుగా తిరిగి వెళ్తుంటారు. మింట్‌కాంపౌండ్‌ దారిని సచివాలయం కోసం రోడ్డు వేస్తూ కొద్ది రోజులుగా పూర్తిగా మూసేశారు. ఐమ్యాక్స్‌ దారి కూడా మూతపడడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడితే తమకు నరకమేనని బస్తీవాసులు వాపోతున్నారు. 

ముందస్తు చర్యలు విస్మరించారు..?

ఐమాక్స్‌ థియేటర్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ మధ్య ఈ-రేసింగ్‌ జరగనుంది. దీనికోసం అక్కడ ఏర్పాట్లు చేశారు. సమయం దగ్గర పడటం వల్ల పనుల కోసం ఎన్టీమార్గ్‌లో ట్రాఫిక్‌ను నిలిపివేయడాన్ని ఎవరూ తప్పపట్టరు. కానీ నాలుగు రోజుల ముందే సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు తెలుగుతల్లి పైవంతెన కింది నుంచి రాకుండా అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ట్రాఫిక్‌ను ఆపేశారు. అలాగే కిమ్స్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు మీదుగా ఖైరతాబాద్‌ రాకుండా మూసివేశారు. మింట్‌కాంపౌండ్‌ దారిలో అదే పరిస్థితి. గంటలకొద్దీ ట్రాఫిక్‌ నిలిచినా  ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లమీద కనిపించలేదు.

ఇదీ పరిస్థితి..

* పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్‌ మీదుగా అబిడ్స్‌ వెళ్లేందుకు సాధారణంగా పావుగంట సమయం పడుతుంది. మంగళవారం ఈ దూరం వెళ్లడానికి దాదాపు గంట పట్టింది. షాదన్‌ కాలేజీ దగ్గర యూటర్న్‌ కూడా మూసివేయడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
* ఖైరతాబాద్‌ ట్రాఫిక్‌ ప్రభావం మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌ తదితర ప్రాంతాలపై కూడా పడింది. రేతిబౌలి నుంచి సోమాజిగూడ వరకు వెళ్లడానికి ఏకంగా గంటన్నర సమయం పట్టింది.
* సికింద్రాబాద్‌ నుంచి లక్డీకాపూల్‌, మెహిదీపట్నం, అత్తాపూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* మింట్‌ కాంపౌండ్‌ వైపు రాకపోకలను నిలిపేయడంతో మింట్‌కాంపౌండ్‌లోని విద్యుత్‌శాఖ కార్యాలయం, ట్రాఫిక్‌ కార్యాలయంలో విధులు నిర్వహించే పోలీసులు ఖైరతాబాద్‌ రైల్వేగేట్‌ మీదుగా బడాగణేష్‌, ముద్రణాలయం నుంచి కార్యాలయాలకు చేరుకోవడానికి అనుమతి ఇచ్చారు.
* రేసుల కారణంగా సాధారణ ట్రాఫిక్‌ను అనుమంతిచపోవడంతో ఐమ్యాక్స్‌లో సినిమా ప్రదర్శనలు రద్దయ్యాయి. అక్కడే ఉండే ప్యారడైజ్‌ హోటల్‌ను తాత్కాలికంగా మూసేశారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్కులను మూసేశారు.
* ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 20 అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. దీంతో రోగి బంధువులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఈ వాహనాలకు దారి ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని