logo

Toefl Score: రూ.20 వేలకే టోఫెల్‌ టాప్‌స్కోర్‌ ప్రచారం.. నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల అరెస్టు

సాంకేతిక పరిజ్ఞానంలో పట్టున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు.. డబ్బు సంపాదనకు తప్పటడుగులు వేశారు.. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు.

Updated : 08 Feb 2023 12:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానంలో పట్టున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు.. డబ్బు సంపాదనకు తప్పటడుగులు వేశారు.. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. టోఫెల్‌/జీఆర్‌ఈలో మంచి స్కోర్‌కు సహకరిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురు నిందితులను హైదరాబాద్‌ నగర సీసీఎస్‌/సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో సైబర్‌ క్రైమ్‌ డీసీపీ స్నేహమెహ్రాతో కలసి నగర సీసీఎస్‌ సంయుక్త సీపీ డాక్టర్‌ గజరావు భూపాల్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన జీఎస్‌జే ఆదిత్య, ఎం.శర్వణ్‌కుమార్‌, ఎం.సాయిసంతోష్‌, పి.కిషోర్‌, ఏ.కిరణ్‌కుమార్‌, గుణశేఖర్‌ మిత్రులు. వీరిలో శర్వణ్‌కుమార్‌, ఆదిత్య రాయ్‌పూర్‌లోని నిట్‌లో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరికీ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యం ఉండటంతో జీఆర్‌ఈ/టోఫెల్‌ పరీక్షలు రాసే మిత్రులకు సహకరిస్తుండేవారు. వారంతా విదేశాల్లో చదివేందుకు ఎంపికవడంతో.. దాన్నే సొమ్ముగా మార్చుకునేందుకు వీరిద్దరూ పథకం వేశారు. అమలుకు సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకున్నారు. రూ.20 వేలకే జీఆర్‌ఈ, టోఫెల్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఉత్తమ స్కోర్‌ సాధించేలా చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. అత్యంత రహస్యంగా పరీక్ష సమయంలో సహకరిస్తూ డబ్బు రాబట్టేవారు.

వాట్సప్‌లో సమాధానాలు.. ప్రపంచ వ్యాప్తంగా 11,500 విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశానికి టోఫెల్‌/జీఆర్‌ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉండటంతో కొందరు అభ్యర్థులు అడ్డదారులు వెతుకుతున్నారు. పరీక్ష రాసేందుకు అనుమతి పొందిన టెస్ట్‌ టేకర్లు / ఏజెంట్లకు మాత్రమే ఆన్‌లైన్‌ యాక్సెస్‌కు వీలుంటుంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు గుణశేఖర్‌ హస్తినాపురంలో స్నేహితుడైన ఏజెంటు ఇంటిలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని ఎంచుకున్నాడు. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు తమ సొంత కంప్యూటర్‌/ల్యాప్‌ట్యాప్‌తో అక్కడికి చేరేవారు. పరీక్ష సమయంలో స్క్రీన్‌పై ఉన్న ప్రశ్నలను అక్కడే బల్ల కింద దాగిఉండే కిషోర్‌, సంతోష్‌ ఫొటో తీసి వాట్సాప్‌లో శర్వణ్‌కు చేరవేసేవారు. అతడు వాటికి సరైన సమాధానాలను తిరిగి వాట్సప్‌కు పంపేవాడు. కొద్దికాలంలోనే ఎంతో మంది విద్యార్థులు లాభపడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పలువురు అభ్యర్థుల ఫిర్యాదు మేరకు ఈటీఎస్‌ నిర్వాహకులు గత నెలలో గుణశేఖర్‌ బృందం మోసాలు బయటకు తీసుకొచ్చేందుకు ‘డెకాయ్‌ ఆపరేషన్‌’ నిర్వహించారు. నిందితులకు రూ.25 వేలు చెల్లించి మోసాల గుట్టును వెలుగులోకి తెచ్చారు. గత నెల 23న ఈటీఎస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు గుణశేఖర్‌ గతేడాది డిసెంబరులో ఉన్నత చదువులకు అమెరికా వెళ్లినట్టు గుర్తించారు. అతడు ఉపయోగించిన మొబైల్‌ ఫోన్‌ కిరణ్‌కు ఇచ్చాడు. అక్కడి నుంచే ఆదేశాలు జారీచేస్తూ మోసాలకు సహకరిస్తూ వస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఆదిత్య కూడా పరారీలో ఉండగా మిగిలిన నలుగురిని అరెస్టుచేశారు. నిందితుల సహకారంతో టోఫెల్‌/జీఆర్‌ఈ పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలను ఈటీఎస్‌ నిర్వాహకులు సేకరిస్తున్నట్టు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని