logo

వీల్‌ఛైర్‌ నుంచి ఫార్ములా కార్ల వరకు!

హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న ఎలక్ట్రికల్‌ వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. బుధవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించగా గురు, శుక్రవారాల్లోనూ కొనసాగనుంది. ఈనెల 11న నగరంలో జరగనున్న ఫార్ములా-ఈ రేస్‌కు అనుసంధానంగా ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు.

Published : 09 Feb 2023 01:58 IST

ఆకట్టుకుంటున్న ఈవీ-ఎక్స్‌పో
ఈనాడు, హైదరాబాద్‌

హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న ఎలక్ట్రికల్‌ వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. బుధవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించగా గురు, శుక్రవారాల్లోనూ కొనసాగనుంది. ఈనెల 11న నగరంలో జరగనున్న ఫార్ములా-ఈ రేస్‌కు అనుసంధానంగా ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రికల్‌ వీల్‌ ఛైర్‌ నుంచి ఫార్ములా-ఈ రేస్‌ కారు వరకు ఈ ప్రదర్శనలో పెట్టారు. విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలే కాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఎలక్ట్రికల్‌ కార్లు, ఇతర వాహనాలను మొత్తం 40 స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. ఇందులో 2, 3, 4 చక్రాల ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు, ఈ-బైక్‌లు, ఈ-స్కూటర్లు ఇలా ఎన్నో వాహనాలు ప్రదర్శనలో ఉంచారు. సరికొత్త లిథియం-అయాన్‌ బ్యాటరీలు, ఛార్జింగ్‌ సొల్యూషన్లు, వాహన భాగాలు, ఉపకరణాలను కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రజా రవాణా నుంచి వస్తు రవాణాకు సంబంధించి పలు ఈవీ వాహనాలు ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.   


ఈ-ఆటో

ఈ-ఆటోలో 4-6 మంది వరకు ప్రయాణించవచ్చు. చిన్నచిన్న రహదారులు, 5-10 కిలోమీటర్ల దూరానికి వెళ్లడానికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. వీటి ధర రూ.4 లక్షల నుంచి ఉన్నాయి. 7 గంటలపాటు ఛార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నిరాటంకంగా నడుస్తుందని నిర్వాహకులు తెలిపారు. డీజిల్‌, పెట్రోలుతో వాయు కాలుష్యం పెరుగుతోతంది. గ్యాస్‌ ధరలు పెరగడంతో ప్రయాణం భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రజారవాణాకు ఇవి బాగా ఉపయోగపడతాయి. పర్యావరణానికి మేలు చేస్తాయి.


ఈ-సైకిల్‌పై సవారీ

ఈ-సైకిళ్లలో రకరకాల మోడళ్లున్నాయి. కళాశాలకు వెళ్లే విద్యార్థుల నుంచి ఫుడ్‌ డెలవరీ బాయ్‌ల వరకు, వ్యాయామం చేసేవారికి అనువుగా వీటిని రూపొందించారు. మోడల్‌నుబట్టి రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు ఉన్నాయి. లిథియం-అయాన్‌ బ్యాటరీలను ఇందులో వాడుతున్నారు. కొన్నింటిని వాటర్‌ప్రూఫ్‌గా తయారు చేశారు. 3 గంటలపాటు ఛార్జి చేస్తే 30-50 కిలోమీటర్ల వరకు నడవనుంది.


ఈ-మొబైల్‌ క్యాంటీన్‌

స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్మేవారికి ఈ-మొబైల్‌ క్యాంటీన్‌ అనువు. ధర రూ.3 లక్షలపైనే. ఇందులో ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా బ్యాక్సులతో తీర్చిదిద్దారు. వీధుల్లో తిరిగి ఆహార పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు ఈ వాహనం సహాయపడుతుంది. ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్‌ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చునని తెలిపారు.)


అతి తక్కువే ఈ-వీల్‌ఛైర్‌

సాధారణంగా ఎలక్ట్రికల్‌ వీల్‌ఛైర్‌ కొనాలంటే రూ.1.5 లక్షలపైనే. అతి తక్కువకే అంటే ప్రాథమికంగా రూ.32 వేలకే ఎలక్ట్రిక్‌ వీల్‌ఛైర్‌ను ఓ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. బ్యాటరీతో నడుస్తుంది. షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, విమానాశ్రయాల్లో ఎవరి సాయం లేకుండా ఎంచక్కా తిరగవచ్చు. 3 గంటలపాటు ఛార్జింగ్‌ చేస్తే 3 గంటలపాటు నడుస్తుంది. త్వరలో ఇది మార్కెట్‌లోకి రానుంది.


చిరు వ్యాపారాలకు ఈ-కార్ట్‌

వీధుల్లో తిరిగి అమ్ముకునే చిరు వ్యాపారులకు కాటేదాన్‌ కేంద్రంగా ఓ కంపెనీ ఈ-కార్ట్‌ను తయారు చేసింది. నడిపేవారితోపాటు 250 కిలోల భారం మోయగలవు. ఐదారు గంటలపాటు ఛార్జి చేస్తే 100 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.


వాహ్‌నం అద్భుతం

హైటెక్స్‌లో బుధవారం ఈవీ-ఎక్స్‌పోను ప్రారంభించి  బైకుపై కూర్చుని పోజిచ్చిన మంత్రి కేటీఆర్‌. పక్కన.. వర్చువల్‌ డ్రైవింగ్‌ చేస్తున్న ఓ యువతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని