logo

బామ్మర్దీ.. ఏంటిది?

బావ డబ్బుపై కన్నేసిన  బామ్మర్ది కిడ్నాప్‌ డ్రామా ఆడాడు. ఆ నగదు కొట్టేసి జల్సా చేయాలనుకున్నాడు. ఏడుగురి సాయంతో విజయవంతంగా కాజేసినా సీసీ ఫుటేజ్‌తో గుట్టు బయటపడింది.

Published : 09 Feb 2023 01:58 IST

డబ్బు కోసం బావ కిడ్నాప్‌
ఏడుగురు అరెస్ట్‌.. రూ.15 లక్షలు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌, సీఐ హరీశ్‌చంద్రారెడ్డి, డీఐ దుర్గారావు

ఈనాడు, హైదరాబాద్‌ పంజాగుట్ట, న్యూస్‌టుడే: బావ డబ్బుపై కన్నేసిన  బామ్మర్ది కిడ్నాప్‌ డ్రామా ఆడాడు. ఆ నగదు కొట్టేసి జల్సా చేయాలనుకున్నాడు. ఏడుగురి సాయంతో విజయవంతంగా కాజేసినా సీసీ ఫుటేజ్‌తో గుట్టు బయటపడింది. ప్రధాన సూత్రధారి పి.రాజేష్‌ (36)తోపాటు డి.రాఘవేంద్ర (33), పి.నాగజీవన్‌కుమార్‌ (30), అబ్దుల్‌సలీమ్‌ (30), పి.లక్ష్మయ్య (31), ఎ.కృష్ణగోపాల్‌ (27), శ్రీనివాస్‌ (35)ను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు గౌస్‌ కోసం గాలిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఇన్‌స్పెక్టర్‌ హరీశ్‌చంద్రారెడ్డి, డీఐ దుర్గారావుతో కలిసి ఏసీపీ ఎస్‌.మోహన్‌కుమార్‌ వివరాలు తెలిపారు. యూసుఫ్‌గూడ నవోదయకాలనీ వాసి బి.వి.మురళీకృష్ణ (40)కు ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ ఉంది. విజయవాడలో చేతివృత్తి పనులు చేసుకునే బామ్మర్ది పి.రాజేష్‌కు తన కార్యాలయంలో ఉద్యోగమిచ్చి నెలకు రూ.15,000 వేతనం ఇచ్చేవాడు. అక్కడ నిత్యం రూ.లక్షలు చేతులు మారటం గమనించాడు. విజయవాడ వెళ్లినప్పుడు మద్యం మత్తులో సోదరుడు పిల్లా నాగ జీవన్‌కుమార్‌తో చెప్పాడు. దీంతో ఆ నగదు కాజేయాలని ఇద్దరూ పథకం పన్నారు. మరో ఆరుగురి సాయం కోరారు. వాళ్లకు మాత్రం.. అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వ్యక్తి నుంచి వసూలు చేసేందుకు కిడ్నాప్‌ చేయబోతున్నట్టు చెప్పారు.

ఐటీ అధికారులమంటూ..

రాజేష్‌ నగరంలోనే ఉండగా గతనెల 26న మిగిలిన ఏడుగురు కారులో విజయవాడ నుంచి హైదరాబాద్‌ చేరారు. మరుసటిరోజు మురళీకృష్ణ బైకుపై పిల్లలను అమీర్‌పేట్‌ లాల్‌బంగ్లా వద్ద పాఠశాలకు తీసుకెళ్లటాన్ని గమనించారు. అతిన వద్దకెళ్లి తాము ఐటీ అధికారులమంటూ చెప్పి సకాలంలో పన్ను చెల్లించట్లేదంటూ బెదిరించి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఐటీ అధికారులు బావను తీసుకెళ్లారంటూ అక్కకు రాజేష్‌ ఫోన్‌ చేసి రూ.60 లక్షలు ఇవ్వకపోతే అరెస్ట్‌ చేస్తారంటూ చెప్పాడు. తాను కూడా వారి అదుపులోనే ఉన్నానన్నాడు. సొంత తమ్ముడే చెప్పటంతో మురళీకృష్ణ భార్య నమ్మి రూ.30 లక్షల నగదుతో నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఉన్న సోదరుడికి అప్పగించింది. ఆమె వెళ్లగానే నగదు సంచి నాగజీవన్‌కుమార్‌కు అప్పగించిన రాజేష్‌ యూసుఫ్‌గూడలోని సోదరి ఇంటికి చేరాడు. అదేరోజు సాయంత్రం కిడ్నాపర్లు మురళీకృష్ణను బాటసింగారం వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అక్కడ నుంచి మలక్‌పేట వరకూ బస్సులో, తరువాత మెట్రోరైల్లో ఇంటికి చేరాడు. తన కుటుంబం గురించి పూర్తిగా తెలిసినవారే కిడ్నాప్‌ చేశారని అనుమానించి భార్య, పిల్లలకు అపాయం వాటిల్లవచ్చనే భయంతో ఎవరికీ చెప్పలేదు. చివరకు భార్య ప్రోద్బలంతో ఈనెల 4న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్‌స్పెక్టర్లు హరీష్‌చంద్రారెడ్డి, దుర్గారావు, ఎస్సైలు సీహెచ్‌.నరేష్‌, మహ్మద్‌ రఫీయుద్దీన్‌ బృందం దర్యాప్తు చేపట్టారు.


విందు వినోదాలు..

కిడ్నాపర్ల చెర నుంచి బావ బయటపడగానే ఊపిరి పీల్చుకున్నట్టు బామ్మర్ది నటించాడు. పోలీసులూ అనుమానించలే. రూ.30 లక్షలు చేతికి రాగానే మిగిలిన ఏడుగురు ఏపీ, తెలంగాణాల్లోని పలు ప్రాంతాలు చుడుతూ విందు, వినోదాలతో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. సీసీ ఫుటేజ్‌, ఫోన్‌కాల్స్‌ జాబితా ఆధారంగా బామ్మర్దే ప్రధాన సూత్రధారిగా నిర్దారణకు వచ్చారు. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించటంతో కిడ్నాప్‌ డ్రామా వెలుగు చూసింది. ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వారినుంచి రూ.15,04,500 నగదు, కారు, బైకు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి ఏసీపీ మోహన్‌కుమార్‌ రివార్డులందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు