logo

చెత్త డబ్బాల్లో కమీషన్ల కంపు!

స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే పేరుతో జీహెచ్‌ఎంసీ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఒకటీరెండు కాదు.. నాలుగేళ్లుగా ఇదే తంతు. ఏటా రూ.కోట్లతో ట్విన్‌ బిన్స్‌(తడి చెత్త, పొడి చెత్తకు రెండు వేర్వేరు చెత్త డబ్బాలు).

Published : 09 Feb 2023 01:58 IST

ఏటా రూ.5 కోట్ల డబ్బాల కొనుగోళ్లు
ఈనాడు, హైదరాబాద్‌

స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే పేరుతో జీహెచ్‌ఎంసీ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఒకటీరెండు కాదు.. నాలుగేళ్లుగా ఇదే తంతు. ఏటా రూ.కోట్లతో ట్విన్‌ బిన్స్‌(తడి చెత్త, పొడి చెత్తకు రెండు వేర్వేరు చెత్త డబ్బాలు)ను కొనుగోలు చేయడం, వాటిని రోడ్లకు ఇరువైపులా ప్రదర్శించడం, రోజుల వ్యవధిలో అవి మాయమవడం, మరుసటి ఏడాది మళ్లీ ఏర్పాటుచేయడం బల్దియా అధికారులకు అలవాటుగా మారింది. ఇలా ఏటా సుమారు రూ.5 కోట్లు ఆవిరవుతున్నాయి. చెత్త డబ్బాలు విక్రయించే సంస్థ, అధికారుల లోపాయికారి ఒప్పందంతోనే ఏటా కొనుగోళ్లు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛత పెంపొందించేందుకు కేంద్ర సర్కారు ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో దేశవ్యాప్తంగా సర్వే చేపడుతోంది. పాదచారులు రోడ్లపై వ్యర్థాలను పడేయకుండా బిన్లు ఏర్పాటు చేశారా.. లేదా? అనే అంశం సర్వేలో ఉంటుంది. చెత్త డబ్బాల విక్రయ సంస్థలు, కమీషన్లకు ఆశపడే అధికారులు దాన్ని అవకాశంగా మార్చుకున్నారు.

గతంలో ఇలా చేశారు..

కొన్నేళ్ల కిందట మెట్రో కారిడార్లపై మెట్రో రైలు సంస్థ అక్కడక్కడ ట్విన్‌ బిన్లు ఏర్పాటుచేసింది. ఫ్రేముల నుంచి డబ్బాల వరకు ఇనుముతో తయారైఉండేవి. నిర్వహణ లేకపోయినా, నాణ్యత బాగుండటంతో చాలా కాలం కనిపించాయి. కాలిబాటలకు మరమ్మతులు, కొత్త చెత్తడబ్బాల ఏర్పాటు కార్యక్రమాల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ వాటిని తొలగించిందని మెట్రో రైలు సంస్థ చెబుతోంది.

నాలుగేళ్లుగా.. ఏడాదికోసారి ప్రధాన రహదారులపై 2,500 ప్లాస్టిక్‌ ట్విన్‌ బిన్లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేస్తోంది. వీటికి ఉపయోగించే కాంక్రీటు, చెత్తడబ్బాల చుట్టూ ఇనుప ఫ్రేము, ప్లాస్టిక్‌ డబ్బాల నాణ్యతపై విమర్శలున్నాయి. ఫలితంగానే.. రోజుల వ్యవధిలో మూతలు విరిగిపోవడం, డబ్బాలు పగిలిపోవడం, చోరులు సులువుగా తీసుకెళ్లడం జరుగుతున్నాయి.


ఇప్పుడు ఇలా..

రోడ్డుకిరువైపులా 100 మీటర్లకు ఓ జంట బిన్లు ఉండాలి. 1,379 ట్విన్‌ బిన్లు రూ.1.23 కోట్లతో, 1,379 ట్రిపుల్‌ బిన్లు రూ.1.85 కోట్లతో కొనుగోలుకు గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం జంటడబ్బాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, త్వరలో మూడు డబ్బాల ఏర్పాటు మొదలవనుందని అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఒక్కో యూనిట్‌ తక్కువ ధరకు లభించినా, మార్కెట్‌ ధరతో పోలిస్తే రూ.3 వేలకుపైగా జీహెచ్‌ఎంసీ అదనంగా చెల్లించిందనే ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు