logo

చెరువు నీరు.. పొలాలకు ఎలా చేరు..!

ఆ చెరువులు నిర్మించి ఏళ్లు గడుస్తున్నాయి. కొత్త చెరువుల నుంచి ఎకరం భూమికూడా సాగు కాలేదు. వర్షాలకు  నిండి నీరు వాగుల ద్వారా వృథా అవుతోంది.

Published : 09 Feb 2023 01:57 IST

ఏళ్లుగా మరమ్మతులకు నోచని కాల్వలు
బీడు భూములుగా ఆయకట్టు
న్యూస్‌టుడే, పెద్దేముల్‌

గుట్టల మధ్య జలకళతో ఆత్కూరు చెరువు

చెరువులు నిర్మించి ఏళ్లు గడుస్తున్నాయి. కొత్త చెరువుల నుంచి ఎకరం భూమికూడా సాగు కాలేదు. వర్షాలకు  నిండి నీరు వాగుల ద్వారా వృథా అవుతోంది. తరచూ మరమ్మతులు చేపడుతున్నా ప్రయోజనం కలగడం లేదు. కోట్లు వెచ్చించినా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఏళ్లుగా రైతులు తమ పంట పండుతుందని ఆశించినా నిరాశే మిగులుతోంది.

880 ఎకరాలు సాగు కావాల్సి ఉన్నా..

పెద్దేముల్‌ మండలంలో 2002 నుంచి 2012 మధ్య కాలంలో కొత్తగా మూడు చెరువులను నిర్మించారు. అందుకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు. వీటి కింద 880 ఎకరాల భూమి సాగు కావాల్సి ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఎకరం భూమికి నీరు పారలేదు. కొత్తగా నిర్మించిన కాల్వలు, తూములు, షట్టర్లు శిథిలం అయ్యాయి. కాల్వలు పూడుకు పోయాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ కింద రూ.1.4 కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.  

కాల్వలకు పడిన గండి

రెండు గుట్టల మధ్య..: మండలంలోని సిద్దన్నమడుగు తండా, తట్టేపల్లి సమీపంలోని అంబురాన్న అడవిలో పెద్ద వాగుపై 2002లో రెండు గుట్టల మధ్యన ఆత్కూరు చెరువును మొత్తం రూ.కోటికిపైగా ఖర్చు చేసి నిర్మించారు. కాల్వల నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించారు. మిషన్‌ కాకతీయ కింద రూ.50 లక్షలతో కాల్వలు, తూముల మరమ్మతులు చేపట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. కుడి, ఎడమ తూములకు గండ్లు పడ్డాయి. కాల్వలు పూడికతో నిండి ఆనవాళ్లను కోల్పోయాయి. ఈ చెరువు కింద 280 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. ఎకరం భూమికి సైతం సాగు నీరందడం లేదు.

కాల్వలు కనుమరుగు: ఇందూరు అటవీ ప్రాంతంలో 270 ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో బట్టి వాగుపై రూ.కోటి నిధులతో కొత్తగా చెరువును నిర్మించారు. కాల్వలు సరిగ్గా నిర్మించక పోవడంతో సాగు నీరు పొలాలకు వెళ్లే పరిస్థితి లేదు. నాణ్యత లోపించి కాల్వలు దెబ్బతిని నీరంతా వాగులోకి చేరుతోంది. మరమ్మతులకు  మిషన్‌ కాకతీయ కింద రూ.50 లక్షలు ఖర్చు చేసినా లాభం లేదు.  

పదేళ్లుగా కొనసాగుతున్నాయి

మండలంలోని నాగులపల్లి అడవిలో కొత్తగా రూ.4 కోట్ల వ్యయంతో మల్కన్‌దాని చెరువు నిర్మాణాన్ని 2012లో చేపట్టారు. ఇంకా కొలిక్కి రాలేదు. చెరువు నిర్మాణం పూర్తయితే 330 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇప్పటికే చెరువు కట్ట, అలుగు, తూముల నిర్మాణం పూర్తి చేశారు. కుడి, ఎడమ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది.  


నిధులు మంజూరు కావాలి

నవీన్‌, ఏఈ, నీటిపారుదల శాఖ

నిధులు రావాల్సి ఉంది. మరమ్మతులు చేపట్టి రైతులకు సాగు నీటిని అందిస్తాం. నాగులపల్లి చెరువు పనులకు సంబంధించి ఆదేశాలు రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని