logo

Hyd Metro Rail: శబ్దాలు చేస్తూ.. పెచ్చులూడుతూ

మెట్రోరైలు ప్రాజెక్ట్‌ వందేళ్ల కోసం నిర్మించింది.  ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లు చేపట్టడంలో పేరున్న సంస్థనే హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్‌ను నిర్మించింది. స్టేషన్ల దగ్గర్నుంచి వయాడక్ట్‌ల వరకు ప్రీకాస్టింగ్‌ విధానంలో చేపట్టారు.

Updated : 14 Feb 2023 10:42 IST

పలుచోట్ల ప్రమాదకరంగా మెట్రోరైలు ట్రాక్‌ ప్రహరీలు
ఈనాడు, హైదరాబాద్‌

మెట్రోరైలు ప్రాజెక్ట్‌ వందేళ్ల కోసం నిర్మించింది.  ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లు చేపట్టడంలో పేరున్న సంస్థనే హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్‌ను నిర్మించింది. స్టేషన్ల దగ్గర్నుంచి వయాడక్ట్‌ల వరకు ప్రీకాస్టింగ్‌ విధానంలో చేపట్టారు. సంవత్సరాలు గడిచే కొద్దీ మెట్రో నిర్మాణపరంగా లోపాలు బయటపడుతున్నాయి. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కింద నిలబడిన ఒక ప్రయాణికురాలిపై స్టేషన్‌ గోడ పెచ్చులు ఊడి పడటంతో ప్రాణాలు పోయాయి. చాలా స్టేషన్లలో పగుళ్లు వచ్చాయి. వీటికి ఆ తర్వాత మరమ్మతులు చేపట్టారు. ఇప్పుడు ప్రహరీ(పారాపిట్‌ వాల్‌) వంతు వచ్చింది. పలుచోట్ల వీటి పెచ్చులు ఊడి రహదారులపై పడుతున్నాయి. వీటిని సైతం కాస్టింగ్‌ యార్డ్‌లో తయారు చేసి ట్రాక్‌పైకి తీసుకొచ్చి బిగించారు. మెట్రో వెళ్లేటప్పుడు శబ్ద నిరోధకంగా సౌండ్‌ బ్యారియర్స్‌గా పనిచేసే విధంగా ప్రహరీలు తయారు చేశారు. తయారీ దగ్గరే నాణ్యత తనిఖీ చేసిన తర్వాత బిగించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇప్పుడేమో ఒక్కోటి పెచ్చులు ఊడిపడుతున్నాయి. 

లోపల సైతం..

బయట ఉన్నవారికే కాదు లోపల ఉన్నవారికి శబ్దాలు ఇబ్బందికరంగా మారాయి. మలుపుల్లో, కొన్ని మెట్రోరైళ్లలో శబ్దాలు అధికంగా వస్తున్నాయని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. శబ్ద నివారణకు స్వతంత్ర ఏజెన్సీతో అధ్యయనం చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దిల్లీలో ఇలాంటి సమస్య తలెత్తితే ఏజెన్సీతో అధ్యయనం చేయించి నివారణ చర్యలు చేపట్టింది.

వైబ్రేషన్స్‌ అధికంగా..

మెట్రో రాకపోకలు సాగించేటప్పుడు శబ్దాలు అధికంగా రావడమే కాదు వైబ్రేషన్స్‌ ఎక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనివల్ల చుట్టుపక్కల భవనాలకే కాదు.. మెట్రో నిర్మాణాలకు ముప్పు ఏర్పడుతోంది. స్టేషన్‌ గోడలకు పగుళ్లు, ట్రాక్‌ ప్రహరీ పెచ్చులు ఊడిపడటం.. ఇలా ముప్పు విస్తరిస్తోంది. వీటి నిరోధానికి చర్యలు చేపట్టాలని మెట్రో అధికారులను స్థానికులు కోరుతున్నారు.


చిత్రంలో కనిపిస్తున్నది మెట్రో ట్రాక్‌ ప్రహరీ. పుత్లీబౌలి నుంచి ఎంజీబీఎస్‌ మార్గంలో మెట్రో వైబ్రేషన్స్‌కు ప్రహరీలోని సిమెంట్‌ భాగం ఊడిపోయింది.


ఖైరతాబాద్‌- పంజాగుట్ట మార్గంలోని మెట్రో ట్రాక్‌ గోడ ఇది. ఇక్కడ కూడా కొంత భాగం కొన్నాళ్ల క్రితం ఊడిపోయింది. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో  ప్రమాదం తప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని