logo

Hyderabad: పచ్చని సంసారాన్ని కూల్చేసిన ప్రైవేటు బస్సు

మితిమీరిన వేగంతో ఓ ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు పుట్టింటి నుంచి తన భార్యను తీసుకెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 27 Feb 2023 09:02 IST

పుట్టింటి నుంచి భార్యను తీసుకెళ్తూ యువకుడి దుర్మరణం

ట్రావెల్స్‌ బస్సు

రెజిమెంటల్‌బజార్‌, శామీర్‌పేట, న్యూస్‌టుడే: మితిమీరిన వేగంతో ఓ ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు పుట్టింటి నుంచి తన భార్యను తీసుకెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం గోపాలపురం ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది.

పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసాయిట్రావెల్స్‌కు చెందిన బస్సు శంషాబాద్‌ నుంచి మేడ్చల్‌ వెళుతోంది. ఆదివారం రాత్రి 8.10 గంటల సమయంలో వైఎంసీఏ కూడలి వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడటంతో వాహనదారులు అందరూ ఆగిఉన్నారు. మేడ్చల్‌ తిమ్మాపురంవాసి బి.మహేష్‌ మితిమీరిన వేగంతో బస్సు నడుపుతూ వచ్చి ఆగిఉన్న వాహనాలు ఢీకొట్టుకుంటూ కొంతదూరం వెళ్లాడు.

తూంకుంట పురపాలక సింగాయిపల్లికి చెందిన కొత్తపల్లి సందీప్‌గౌడ్‌(35) బస్సు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్రవాహనాలపై ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరిని గాంధీకి తరలించగా, సురారంకాలనీకి చెందిన వినయ్‌ను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు బస్సు డ్రైవర్‌ మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మూడు కార్లు, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయని డ్రైవర్‌ చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వాహనదారులు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు.

భార్య కళ్లెదుటే మృతి..

ప్రమాదంలో మృతిచెందిన సందీప్‌గౌడ్‌కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో పుట్టింట్లో ఉన్న భార్యను ఆదివారం సాయంత్రం  తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చెరోవైపు పడిపోయారు. సందీప్‌ పైనుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కన్నీరుమున్నీరు విలపించిన తీరు అందరిని కలిచివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని