logo

Hyderabad: కుక్కలను పట్టుకోవాలంటే.. కార్పొరేటర్‌ అనుమతి తప్పనిసరట!

కుక్కల స్వైర విహారంతో రాజధానిలోని లక్షల మంది ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఏ రోడ్డులో గుంపుగా వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోనన్న ఆందోళన రోజురోజుకు అధికమవుతోంది.

Updated : 01 Mar 2023 07:40 IST

బల్దియా ఆదేశం.. విమర్శల పాలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు- హైదరాబాద్‌: కుక్కల స్వైరవిహారంతో రాజధానిలోని లక్షల మంది ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఏ రోడ్డులో గుంపుగా వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోనన్న ఆందోళన రోజురోజుకు అధికమవుతోంది. ఈ సమయంలో హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) తక్షణం స్పందించాలి. రోడ్లపై గుంపులుగా తిరుగుతున్న కుక్కలను నిరోధించే చర్యలను తీసుకోవాలి. కానీ బల్దియా మాత్రం కాలనీల్లో కుక్కలను పట్టుకోవాలంటే.. ముందుగా సంబంధిత డివిజన్‌ కార్పొరేటర్‌ అనుమతి తప్పనిసరని సూచిస్తోంది. అనుమతి లేకుండా కుక్కలను పట్టుకుంటే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మేయర్‌ అధ్యక్షతన మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష కార్పొరేటర్ల సమావేశంలో తీసుకున్న తాజా నిర్ణయం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.

చర్యలకు మీనమేషాలు..

అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడిపై శునకాల దాడి ఘటన తర్వాత బల్దియా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. కుక్కల సంఖ్య నియంత్రించడంతో పాటు దాడులకు పాల్పడే వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలి. అందుకు భారీగా కసరత్తు అవసరం. వెటర్నరీ విభాగంలో సిబ్బంది సంఖ్య పెంచాలి. విస్తృతంగా కుక్కల కు.ని ఆపరేషన్లు చేయాలి. కానీ ఈ దిశగా ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనికి భిన్నంగా మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి. కార్పొరేటర్‌ అనుమతి కోసం చూస్తే శునకాల పట్టివేత ముందుకు సాగదని అధికారులు చెబుతున్నారు.  


ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి:బాలుడి తల్లిదండ్రులు

అంబర్‌పేట: ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్‌ తల్లిదండ్రులు గంగాధర్‌, జనప్రియ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో వాచ్‌మెన్‌ లేదా అటెండర్‌, మరేదైనా ఉద్యోగం ఇస్తే పిల్లల్లో తమ కుమారుడిని చూసుకుంటూ బతుకుతామని కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి కుటుంబానికి జీహెచ్‌ఎంసీ రూ.8 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ మంగళవారం వారితో మాట్లాడగా స్పందించారు. ఇలాంటి బాధ మరే తల్లిదండ్రులకు కూడా రావొద్దని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని