logo

Hyderabad: ప్లాటు కొంటున్నారా.. పారాహుషార్‌

కొన్నేళ్లుగా నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, వికారాబాద్‌, యాదాద్రి జిల్లాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారం భారీగా జరుగుతోంది.

Updated : 12 Mar 2023 07:52 IST

ఇన్‌స్టంట్‌ అనుమతులతో రిజిస్ట్రేషన్‌లో మోసాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొన్నేళ్లుగా నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, వికారాబాద్‌, యాదాద్రి జిల్లాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారం భారీగా జరుగుతోంది. ఇదే అదనుగా కొందరు యజమానులు నిషేధిత స్థలాలను ప్లాట్లుగా అమ్ముతున్నారు. కొన్ని స్థిరాస్తి సంస్థలు అధికారిక, అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల స్థలాలను భారీగా విక్రయించి అడ్డదారిలో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. కొనుగోలుదారుకు అక్కడే సమస్య మొదలవుతోంది. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌కు ప్రామాణికంగా తీసుకున్న నిర్మాణ అనుమతి 15 రోజుల్లో రద్దవుతుంది. దీంతో భవిష్యత్తులో సదరు స్థలాన్ని ఇతరులకు విక్రయించడం కష్టమవుతుంది. స్థిరాస్తి వ్యాపారులపై బాధితులు కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తుండటంతో.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఇతర స్థానిక సంస్థలు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశాయి.

మోసం ఏమిటంటే..?

లేఅవుట్లలో అధికార, అనధికార అనే రెండు రకాలుంటాయి. అధికారిక లేఅవుట్‌లోని ప్రతి ప్లాటుకు సంఖ్య ఉంటుంది. వాటి ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. బై నంబర్లతో అమ్మే ప్లాట్ల విషయంలో కొనుగోలుదారు జాగ్రత్తగా ఉండాలి. అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్ల అమ్మకాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. అనుమతి లేకపోయినా ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి, ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకుని ఇళ్లు కట్టుకోవచ్చు. ఇంటి అనుమతికి అర్హత లేని లే  అవుట్ల అమ్మకాలు సమస్య సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

* టీఎస్‌బీపాస్‌ చట్టం ప్రకారం.. 600 గజాల్లోపు విస్తీర్ణంలో, 10మీటర్ల ఎత్తు వరకు చేపట్టే నిర్మాణానికి దరఖాస్తు చేయగానే అనుమతి మంజూరవుతుంది. దాన్ని ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ అంటారు. 15 రోజులకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి తుది నిర్ణయం తీసుకుంటారు. నిర్మాణానికి అర్హమైతే  తుది ఆమోద పత్రం(కమెన్స్‌మెంట్‌ లెటర్‌) ఇస్తారు.  

* అధికారిక లేఅవుట్‌లో ప్లాటు కొనాలంటే.. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ ఆమోదించిన తుది లేఅవుట్‌ను అనుసరించాలి. అందులో నంబర్లు వేసిన వాటినే కొనాలి. కొన్ని సందర్భాల్లో.. దురాశతో వ్యాపారులు.. లేఅవుట్‌లోని ఖాళీ స్థలాలు, పార్కు, ఇతర అవసరాలకు కేటాయించిన స్థలాలను అమాయకులకు అమ్ముతుంటారు. ఇది మొదటి రకం మోసం.

* అనధికారిక లేఅవుట్‌లో కొందరు.. చెరువు ఎఫ్‌టీఎల్‌లో, బఫర్‌ జోన్‌లో, నిషేధిత భూముల్లో, గ్రీన్‌ జోన్‌లో, మాస్టర్‌ ప్లాన్‌లో రోడ్డు కోసం కేటాయించిన స్థలంలో లేఅవుట్‌ వేసి అమ్ముతుంటారు. ఇది రెండో రకం మోసం.

స్థానిక సంస్థల లేఖలు..

ఇంటి స్థలాలకు ముందుగా బయానా తీసుకుంటున్నారని, తర్వాత ఇంటి అనుమతికి టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకుని, ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ తీసుకుంటున్నారని ప్రణాళిక విభాగం చెబుతోంది. అదే అప్రూవల్‌తో కొనుగోలుదారుకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారని, తర్వాత ఇంటి అనుమతి తిరస్కరణకు గురవడం, కొనుగోలుదారు నష్టపోతున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ ప్రాతిపదికన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేయొద్దని వేర్వేరు స్థానిక సంస్థలు రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖలు రాశాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన తుది ఆమోద పత్రం జారీ అయ్యాకే ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరాయి.

అనుమతిపత్రం పరిశీలన ఇలా..

ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ పత్రంపై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దాన్ని స్కాన్‌ చేస్తే.. సదరు ఫ్లాటులో నిర్మాణం చేపట్టేందుకు తుది ఆమోదం మంజూరైందా, అనుమతి తిరస్కరణకు గురైందా అనే విషయం తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని