logo

‘భారత్‌లో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్‌ వ్యాధులు’

భారతదేశంలో ప్యాంక్రియాటిక్‌ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోందని యశోద గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి పేర్కొన్నారు.

Published : 13 Mar 2023 02:58 IST

మాట్లాడుతున్న డాక్టర్‌ పవన్‌ గోరుకంటి

మాదాపూర్‌, న్యూస్‌టుడే: భారతదేశంలో ప్యాంక్రియాటిక్‌ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోందని యశోద గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్‌ సర్జరీస్‌పై యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సదస్సుకు హాజరైన  డాక్టర్‌ పవన్‌ గోరుకంటి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 1.4 మిలియన్ల మంది ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, దురదృష్టవశాత్తు వారిలో చాలా మందికి వ్యాధి ఉన్న విషయం  ఆలస్యంగా నిర్ధారణ అవుతోందన్నారు. రోగ నిర్ధారణ తర్వాత 10 శాతం కంటే తక్కువ మంది రోగులు ఐదు సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నారని వివరిస్తున్నారు. పొగాకు, ధూమపానం, మద్యం తాగడం, ఊబకాయం.. ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌కు కారణమని తెలిపారు. సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో లక్ష మందిలో 200 మంది అక్యూట్‌ ప్యాంక్రియాటైటిస్‌ బారిన పడుతున్నారని వెల్లడించారు. ఇది అరుదైన క్యాన్సరని, మనదేశం.. ప్రపంచంలో నాలుగో స్థానంలో, మరణాల్లో 7వ స్థానంలో ఉందన్నారు. 2030 నాటికి మరణాల్లో రెండో స్థానానికి చేరవచ్చన్నారు. లాప్రోస్కోపిక్‌, అధునాతన రోబోటిక్‌ టెక్నాలజీ ద్వారా సంక్లిష్టమైన ప్యాంక్రియాటిక్‌ సర్జరీలను విజయవంతంగా నిర్వహించవచ్చన్నారు. ఈ సదస్సులో అత్యాధునిక రోబోటిక్‌, లాప్రోస్కోపిక్‌, ఓపెన్‌ టెక్నిక్‌ ద్వారా అనేక ప్యాంక్రియాటిక్‌ సర్జరీలు ఎలా నిర్వహించాలనే అంశాలపై యువ సర్జన్లకు ప్రత్యేక్ష సర్జికల్‌ వర్క్‌షాప్‌ ద్వారా వివరించడం జరిగిందన్నారు. ఈ సదస్సుకు 500 మందికిపైగా ప్రాక్టీస్‌ సర్జన్లు, ప్యాంక్రియాస్‌ వైద్యరంగానికి సంబంధించిన ప్రముఖ వైద్యనిపుణులు హాజరయ్యారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని