logo

TSRTC: విద్యార్థినులకు ఆర్టీ‘షీ’ ప్రత్యేక బస్సులు

విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విద్యామండలి అందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

Updated : 16 Mar 2023 07:00 IST

మహిళా కళాశాలల నుంచి నడిపించాలని నిర్ణయం

ఈనాడు - హైదరాబాద్‌: విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విద్యామండలి అందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం తీసుకెళ్లడం.. సాయంత్రం తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిప్పులు నడపడానికి సన్నాహాలు చేస్తోంది. మహిళా కళాశాలలు సొంతంగా ఏర్పాటు చేస్తున్న బస్సుల్లో అధిక ఫీజులుండడంతో కొంతమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇలా ప్రతి కళాశాల నుంచి వంద నుంచి 200ల మంది సొంతంగా వస్తున్నారని.. సంస్థ గుర్తించింది.  


ప్రత్యేక పాస్‌లు

సొంతంగా రవాణావ్యవస్థ ఉన్న కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. అంత మొత్తం భరించడం సామాన్యులకు పెనుభారంగా పరిణమిస్తోంది. దీంతో ఆర్టీసీ సిటీ బస్సులు, షేర్‌ ఆటోల్లో ప్రయాణించి కళాశాలలకు చేరుకుంటున్నారు. అలాంటివారిని గుర్తించి 50 మందికో బస్సు ఉండేలా సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీంతో స్థిరమైన ఆదాయం సమకూరడమే కాకుండా.. సురక్షితమైన ప్రయాణం అందించడానికి వీలుపడనుందని ఆర్టీసీ భావిస్తోంది. అందుకు కళాశాల దూరాన్ని బట్టి బస్సు టిక్కెట్‌ ధర ఆధారంగా నెలవారీ ప్రత్యేక పాస్‌ను సమకూర్చాలని నిర్ణయించింది. విద్యార్థుల బస్సు పాస్‌తో సంబంధం లేకుండా.. ప్రత్యేకంగా ఆ బస్సులో విద్యార్థినులే ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతి విద్యార్థి ఏడాదికి దాదాపు రూ.20 వేలకు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.


డివిజన్ల వారీ నిర్ణయాలు

వచ్చే విద్యా సంవత్సరానికి 500 బస్సులను టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధం చేస్తోంది. కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి.. ప్రత్యేక బస్సులు నగరం నలుమూలల నుంచి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులను దించేసిన తర్వాత అదే మార్గంలో వేరే ప్రయాణికులను ఎక్కించుకోవడం ద్వారా పెద్ద నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ప్రత్యేక బస్సులను నడపడం అంతా డివిజనల్‌ మేనేజర్లకే బాధ్యతలు అప్పగిస్తున్నారు.  తర్వాత దశలో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ముందుకొస్తే అందరికీ ప్రత్యేక బస్సులు సమకూర్చనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని