logo

ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

Published : 19 Mar 2023 01:46 IST

పరారీలో ఝార్ఖండ్‌కు చెందిన కీలక సూత్రధారి

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. వీరు నగరంలో వివిధ ఠాణాలతోపాటు పలు జిల్లాల్లో 41 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, 8 సెల్‌ఫోన్‌లు, ఒక బైక్‌, రూ.1.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన వేముల నాగప్రేమ్‌(21) అమెజాన్‌ సెల్లర్‌గా పని చేస్తున్నాడు. నల్గొండ జిల్లా చందన్‌పేట మండలం, అచ్చంపేట(గట్టుకింద)కి చెందిన బనవత్‌ కుమార్‌(20) అమెజాన్‌ ప్యాకింగ్‌లో పని చేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. ఇద్దరు సరూర్‌ నగర్‌ ప్రాంతంలో ఉంటున్నారు. 2020లో ఝార్ఖండ్‌ ప్రాంతానికి సైబర్‌ నేరగాడు జుపైర్‌ రాహుల్‌ నాగప్రేమ్‌ని మోసం చేసి రూ.15 వేలు కాజేశాడు. నా డబ్బులు కొట్టేశావు, ఇవ్వాలని గద్దించగా.. రాహుల్‌ వేరే వ్యక్తిని మోసం చేయగా వచ్చిన ఫోన్‌ని నాగప్రేమ్‌కి పంపించాడు. ఇలా వీరి మధ్య బంధం బలపడింది. అతడి నుంచి సైబర్‌ నేరాలు ఎలా చేయాలనే అంశాలను నాగప్రేమ్‌ తెలుసుకున్నాడు. అనంతరం కుమార్‌తో కలిసి నేరాలకి పాల్పడటం ఆరంభించాడు. ఎనీ డెస్క్‌, తదితర యాప్‌లను పలువురి ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేయించి ఓటీపీ తెలుసుకొని వచ్చే వస్తువులను బుక్‌ చేసుకొని తీసుకోవడం, డబ్బులు డ్రా చేయడం మొదలు పెట్టారు. వచ్చిన వస్తువులను తక్కువ రేటుకు అమ్ముకోవడం జల్సాలకు వినియోగించడం చేస్తున్నారు. చందానగర్‌ ప్రాంతానికి చెందిన సులోచన బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కొనుగోలు చేశారు. నిందితులు ఫోన్‌ చేసి మీ ఫోన్‌ యాక్టివేట్‌ కావడానికి, కేవైసీ కోసమంటూ ఎనీడెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి ఓటీపీ తెలుసుకొని క్రెడిట్‌ కార్డు నుంచి రూ.1.39 లక్షలు దోచుకున్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్‌కి చెందిన రాహుల్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని