logo

సవాళ్లను సామర్థ్యంతో పరిష్కరించిన వ్యక్తి పీవీ నర్సింహారావు

భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో ఎదురైన సవాళ్లను తన సామర్థ్యంతో పరిష్కరించేందుకు అనేక చర్యలను చేపట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ అన్నారు.

Published : 19 Mar 2023 02:17 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జస్జిస్‌ పి.ఎస్‌.నరసింహ, చిత్రంలో కృష్ణదేవరావు, జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు,  మా శర్మ, వెంకట్‌ నారాయణ్‌, కృష్ణారావు, రాఘవేంద్రరావు

జూబ్లీహిల్స్‌: భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో ఎదురైన సవాళ్లను తన సామర్థ్యంతో పరిష్కరించేందుకు అనేక చర్యలను చేపట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో శనివారం రాత్రి ఐకాన్‌ సంస్థ ఆధ్వర్యంలో రచయిత కృష్ణారావు ఆంగ్లంలో రాసిన ‘ది క్వింటెస్సెన్సియల్‌ రెబల్‌’ పేరుతో పీవీపై రాసిన పుస్తకాన్ని ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, నల్సార్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి పి.కృష్ణదేవరావు, ప్రముఖ జర్నలిస్టు వెంకట్‌ నారాయణ్‌, ఎస్సార్‌ పబ్లికేషన్స్‌ అధినేత రాఘవేంద్రరావు, పుస్తక రచయిత కృష్ణారావులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పీవీ రాజకీయపరంగా ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ ఏమాత్రం జంకకుండా వాటిని పరిష్కరించుకోవడంలో నేర్పును కనబర్చారని వివరించారు. తనలోని ఆలోచనలను తనలోనే మదింపు చేసుకొని ‘అంతర్ముఖుడిగా’ ఉండేవారని, ఆయన నిష్క్రమణ సైతం మౌనంగానే కొనసాగిందని అన్నారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని పదవిని చేపట్టేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చినా ఎంతో చాకచక్యంతో మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు. 1991లో 2 మిలియన్‌ డాలర్ల లోటుతో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడంతో పాటు ప్రస్తుతం దేశం ఆర్థిక సామర్థ్యాన్ని 5.6 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకునే పరిస్థితి కల్పించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. సీనియర్‌ పాత్రికేయులు మా శర్మ, కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు, ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.సీతారామారావు, పీవీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని