logo

సమీకృతం వేగవంతం.. సమస్యలిక దూరం

తాండూరులో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తిచేసి కార్యాచరణకు ఉపక్రమించారు.

Published : 19 Mar 2023 02:33 IST

రూ.7.50కోట్లతో మార్కెట్‌ పనులు షురూ

తొలగింపులో పాత గోదాం  

న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌: తాండూరులో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తిచేసి కార్యాచరణకు ఉపక్రమించారు. ఇదివరకు ఉన్న రైతు బజారు ప్రాంతంలోనే ఈ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.7.50కోట్లు మంజూరు చేసింది. దీంతో పాత గోదాంలను తొలగిస్తున్నారు. వాటి స్థానంలో వివిధ విభాగాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టనున్నారు.

3.85 ఎకరాలు, 343 దుకాణాలు

పురపాలక సంఘ ఆధ్వర్యంలో కొత్త మార్కెట్‌ను మొత్తం 3.85 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. అందులో 343 స్టాల్స్‌ను అందుబాటులోకి తెస్తారు. వాటిల్లో పూలు, పండ్లు, కూరగాయలు, వెజ్‌, నాన్‌ వెజ్‌ వ్యాపారాలు, హోల్‌ సేల్‌ దుకాణాలు ఉంటాయి. ఏడాదిన్నర కాలంలో మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకు రావటానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

ప్రస్తుతం రహదారే ఆధారం

సమీకృత మార్కెట్‌ ఏర్పాటుతో ఏళ్ల నుంచి నెలకున్న దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా మార్కెట్‌ లేక పోవటంతో పూలు, పండ్లు, కూరగాయల వ్యాపారాలు రోడ్ల మీదనే సాగుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి. వ్యాపారులకు, రైతులకు నీడ లేక పోవటంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూనే  కాలం వెళ్లదీస్తున్నారు. ఇక హోల్‌సేల్‌ వ్యాపారులకు సరైన వసతి లేక పురపాలక సంఘానికి చెందిన సముదాయంలోనే  వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అక్కడ రైతుల నుంచి గుంపగుత్త లెక్కన కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.

కూడళ్లు కిటకిట: పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు భద్రేశ్వర, మహాత్మా గాంధీ, వినాయక కూడలి తదితర ప్రాంతాలు క్రయ విక్రయాలతో కిటకిట లాడుతుంటాయి. నియోజకవర్గంలోని పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌, తాండూరు మండలం, పట్టణంతో సహా పక్క నియోజక వర్గాలు కొడంగల్‌, పరిగి, పొరుగు జిల్లా మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి జిల్లాల నుంచి ప్రతి రోజూ ప్రజలు వివిధ పనుల నిమిత్తం, రకరకాల కొనుగోళ్ల కోసం పట్టణానికి వస్తుంటారు. దీంతో పాటు ఇక్కడి ప్రాంతంలో విస్తారంగా నాపరాతి, సిమెంటు, సుద్ద పరిశ్రమలు, గనులు ఉండటంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత పెద్ద వ్యాపార కేంద్రంలో ప్రత్యేకంగా మార్కెట్‌ లేక పోవటంతో ప్రజలు, వ్యాపారులు ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులకు సమీకృత మార్కెట్‌ నిర్మాణంతో త్వరలోనే పరిష్కారం లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని