logo

పెరిగిన సాయం.. మైనార్టీలకు ప్రయోజనం

యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా గతేడాది డిసెంబరులో 2022-23 సంవత్సరానికి అల్ప సంఖ్యాక వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు.

Updated : 19 Mar 2023 05:18 IST

146 నుంచి 292 యూనిట్ల మంజూరుకు నిర్ణయం
న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం, వికారాబాద్‌ టౌన్‌

దరఖాస్తు చేస్తున్న లబ్ధిదారులు

యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా గతేడాది డిసెంబరులో 2022-23 సంవత్సరానికి అల్ప సంఖ్యాక వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆరేళ్ల తర్వాత మైనార్టీ యువతకు ఈ అవకాశం కల్పించటంతో భారీగా స్పందన వచ్చింది. రెండు కేటగిరీలుగా జిల్లాకు రూ.1.43 కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేస్తుండగా వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. తీవ్ర పోటీ నెలకొనడంతో 146 యూనిట్ల లక్ష్యాన్ని 292 యూనిట్లకు పెంచుతూ రెట్టింపు చేశారు. తద్వారా మరింత మందికి ప్రయోజనం చేకూరనుంది.  

వచ్చిన అర్జీలు 8,016

జిల్లాలోని 20 మండలాల్లోని మైనార్టీలకు 146 యూనిట్లు అందించేందుకు అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గడువులోగా అంచనాలకు మించి మొత్తం 8,016 దరఖాస్తులు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాయితీ రుణాలను అందించేందుకు కసరత్తు చేశారు. దరఖాస్తుల సంఖ్య పెరగటంతో లక్ష్యాలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయడం అధికారులకు ఇబ్బందిగా మారింది. కొన్ని చోట్ల ఎంపిక ప్రక్రియను అడ్డుకొని దరఖాస్తుదారులు ఆందోళనలు సైతం చేశారు. దీంతో వారు పునరాలోచించాల్సి వచ్చింది.  

* 2015-16 ఏడాదిలో చివరిసారిగా మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు ఇవ్వగా... ఆరేళ్లుగా వీటి ప్రస్తావనే లేకుండా పోయింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం ముం దుకు రావటంతో అల్ప సంఖ్యాకులు ఉత్సాహం చూపారు. లక్ష్యాన్ని రెండు కేటగిరీలుగా విభజించి రుణాలు ఇచ్చేందుకు అవకాశాలు కల్పించారు. ఒకటో కేటగిరీలో 80 శాతం రాయితీ వర్తిస్తుండగా 36 రకాలతో 102 యూనిట్లు ఉండగా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేస్తున్నారు. రెండో కేటగిరీలో 70 శాతం రాయితీగా 52 రకాలుండగా 44 యూనిట్లు కేటాయించారు. ఇందుకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు.


ఎంపికలు ముగిశాయి
సుధారాణి, మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారిణి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలుతో లబ్ధిదారుల ఎంపిక, రుణాల అందజేత ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటికే చాలా చోట్ల లబ్ధిదారుల ఎంపికలు ముగిశాయి. మిగిలిన చోట్ల ఈ నెల 21 నుంచి లబ్ధిదారులను గుర్తించి నెలాఖరు నాటికి రుణాలు అందిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు