logo

Hyderabad: స్వప్నలోక్‌ను కూల్చాలా.. వద్దా?

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్సులో గురువారం చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం దృష్ట్యా.. భవన సముదాయాన్ని కూల్చాలా, వద్దా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

Updated : 19 Mar 2023 10:20 IST

పిల్లర్లు, స్లాబు సామర్థ్య పరీక్షలు పూర్తయ్యాక నిర్ణయం
జేఎన్‌టీయూ నిపుణుల బృందం వెల్లడి

కాంప్లెక్స్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్సులో గురువారం చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం దృష్ట్యా.. భవన సముదాయాన్ని కూల్చాలా, వద్దా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అందుకు సమాధానం లభించాలంటే వారం పడుతుందని జేఎన్‌టీయూ నిపుణుల బృందం వెల్లడించింది. నిర్మాణం ఏ మేర దెబ్బతిన్నదనే అంశాన్ని పరిశీలించేందుకు శనివారం జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు డి.ఎన్‌.కుమార్‌, శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి భవనాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ప్రమాదం ఐదో అంతస్తులో జరిగినప్పటికీ.. నాలుగు, ఆరు అంతస్తులు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు.

భవనం మొత్తానికి పరీక్ష.. : అగ్ని ప్రమాదంతో దెబ్బతిన్న అంతస్తులతోపాటు భవనం మొత్తానికి పరీక్ష చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 38ఏళ్ల నాటి భవనం కావడంతో.. కాంప్లెక్సు చుట్టూ బాల్కనీలు, సన్‌షేడ్‌, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. 2019లో ఈ భవనంలో పెచ్చులూడి ఓ వ్యక్తి చనిపోయారు. అప్పట్లో యజమానికి నోటీసులు ఇవ్వగా స్పందన కొరవడింది. నాన్‌ డిస్ట్రక్టివ్‌ పరీక్ష  అనంతరం కాంప్లెక్సుపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు ‘ఈనాడు’తో తెలిపారు.

ఐదో అంతస్తులో దగ్దమైన గది

పోలీసుల అదుపులో ముగ్గురు : అగ్ని ప్రమాదం జరిగిన ఐదో అంతస్తులోని కేడియా ఇన్ఫోటెక్‌, క్యూనెట్‌కు చెందిన ముగ్గురిని మహంకాళి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. క్యూనెట్‌కు ఇండియాలో అనుబంధంగా కొనసాగుతున్న విహాన్‌ సంస్థకు చెందిన భాను, శివ, కేడియా ఇన్ఫోటెక్‌ యజమానినీ అదుపులోకి తీసుకున్నారు.  స్వప్నలోక్‌ - సూర్యకిరణ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అసోసియేషన్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. స్వప్నలోక్‌తో పాటు సూర్యకిరణ్‌ కాంప్లెక్స్‌ సీజ్‌ చేసి బోర్డులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని