Kishanreddy: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో మార్పు తెస్తాం: కిషన్‌రెడ్డి

తాము మేకిన్‌ ఇండియా అంటే కేసీఆర్‌ జోకిన్‌ ఇండియా అంటూ అవహేళన చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అవహేళన చేయకుండా ప్రోత్సహిస్తే బాగుంటుందని హితవుపలికారు.

Published : 19 Mar 2023 19:05 IST

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విజన్‌తో తయారీ సంస్థలను నెలకొల్పుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 5ఎఫ్‌ విజన్‌తో తెలంగాణలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు కానుందన్నారు. ఈ పథకం కింద రూ.4,445 కోట్లు కేటాయించారని చెప్పారు. ఒక్కో టెక్స్‌టైల్‌ పార్కుకు కనీసం వెయ్యి ఎకరాల స్థలం అవసరమవుతుందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్టు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ఏప్రిల్‌లో ప్రధాని మోదీ పర్యటన..

తాము మేకిన్‌ ఇండియా అంటే కేసీఆర్‌ జోకిన్‌ ఇండియా అంటూ అవహేళన చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అవహేళన చేయకుండా ప్రోత్సహిస్తే బాగుంటుందని హితవుపలికారు. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. వచ్చే నెలలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రూ.720 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌ రైలు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఏదైనా మంచి జరిగితే కేసీఆర్‌, కేటీఆర్‌ తమ ఖాతాలో వేసుకుని.. చెడు జరిగితే భాజపా కుట్ర అంటున్నారని మండిపడ్డారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీకి, భాజపాకు ఏం సంబంధముందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం మద్యం వ్యాపారం చేస్తే తమకొచ్చే నష్టమేమీ లేదన్న కిషన్‌రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. భారాసకు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం టికెట్లు మహిళలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భాజపా అభ్యర్థిని గెలిపించిన టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భాజపా ద్వారా మార్పు వస్తుందని ప్రజలు భావించారనే దానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ద్వారా స్పష్టమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో మార్పు తీసుకొస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని