logo

చేరువయ్యే కేంద్రం.. చింత తీరే వైనం

రైతు వేదికల్లో డీసీఎమ్మెఎస్‌ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలను నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని పేర్కొంటోంది. ఇందుకు రైతులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.

Published : 20 Mar 2023 02:28 IST

రైతు వేదికల్లో ఎరువుల విక్రయాలు
సులువు కానున్న కొనుగోళ్లు
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌ 

రైతు వేదికల్లో డీసీఎమ్మెఎస్‌ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలను నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని పేర్కొంటోంది. ఇందుకు రైతులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం కొన్నిచోట్లే అందుబాటు

ప్రస్తుతం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లోనే ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో సకాలంలో తీసుకువెళ్లడం, అందుబాటులో లేకపోవడంతో సీజన్‌ సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉంచితే అవసరతను బట్టి కొనుగోలుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

* జిల్లాలోని పరిగి, తాండూరు, కొడంగల్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో ఖరీఫ్‌లో ఆరు లక్షల ఎకరాలు, యాసంగిలో 1.12లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్సు ఎరువులు సుమారు 1,05,802 మెట్రిక్‌ టన్నులకు పైగానే అవసరం పడుతున్నాయి.

* 99 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో అన్నిచోట్లా రైతు వేదికలను రూ.21.78కోట్ల వ్యయంతో పూర్తిచేశారు. వీటిలో అప్పుడప్పుడూ రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న వానా కాలం నుంచి వీటిలో ఎరువుల విక్రయాలను చేపట్టాలని భావించడంతో రైతులకు వెసులుబాటు కలగనుంది.

పారదర్శకతకు వీలు

సీజన్‌ వచ్చిందంటే చాలు ఎరువులకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరుగుతోంది. అధికారులు ఎన్ని రకాల కట్టడి చేస్తున్నా అధిక ధరలకు విక్రయాలు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. ఒక్క డీసీఎంఎస్‌ శాఖల్లోనే రైతులకు నిర్ణీత ధరలకు లభ్యమవుతున్నాయి. దీంతో వేదికల ద్వారా అమ్మకాలు కొనసాగిస్తే పారదర్శకత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అధికారులు ఏమంటున్నారంటే..

వేదికల్లో ఎరువుల విక్రయాలు వ్యవసా య విస్తరణాధికారులకు అదనపు భారంగా భావిస్తున్నారు. సీజన్‌ నెల రోజులకు పైగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో రైతులకు సూచనలు, సలహాలు అన్నది లేకుండా పోతుందని చెబుతున్నారు. 

రక్షణ.. భారం కానుందా..

చాలా ప్రాంతాల్లో రైతు వేదికల నిర్మాణానికి అందుబాటులో స్థలాలు లేకపోవడంతో కిలోమీటరు దూరంలోనూ ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీటికి రక్షణ తలకుమించిన భారంగా మారింది. రాత్రి సమయంలో కాపలా అన్నది ప్రధాన సమస్యగా మారనుందని అధికారులు చెబుతున్నారు. ఎరువుల నిల్వ, భద్రత చర్యలు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేయాలని పలువురు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని