logo

రూ. కోట్లున్నా.. తప్పని పాట్లు

హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే వికారాబాద్‌ ప్రవేశ మార్గంలోని రైల్వే వంతెనపై నుంచే రావాలి.

Published : 20 Mar 2023 02:28 IST

వారధి నిర్మాణంలో జాప్యం
న్యూస్‌టుడే, వికారాబాద్‌

ఇటీవలే రైల్వే వంతెనను సందర్శించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి, అధికారులు 

హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే వికారాబాద్‌ ప్రవేశ మార్గంలోని రైల్వే వంతెనపై నుంచే రావాలి. అలాగే తాండూరు నుంచి పరిసర గ్రామాల ప్రజలు హైదరాబాద్‌ వెళ్లాలంటే దీని మీదుగానే వెళ్లాలి. దాదాపు 25 సంవత్సరాల అప్పటి అవసరాలకు తగినట్లు నిర్మించడం, సామర్థ్యానికి మించి వాహనాలు తిరగడం, మరమ్మతులు చేపట్టక పోవం తదితర కారణాలతో వంతెన శిథిల దశకుచేరింది. అప్పట్లో దీనిని పూర్తిగా వంకరగా నిర్మించారు. ఈ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వంతెన నిర్మాణ పనుల కోసం గత జూన్‌ నెలలో రూ.12 కోట్లు మంజూరు చేసింది. గత నవంబర్‌ నెలలో మరమ్మతు నిమిత్తం రోడ్లు, భవనాల శాఖాధికారులు సర్వే చేశారు. ఇన్ని చేసినా పనులు మాత్రం ప్రారంభించలేదు. ఫలితంగా వాహనదారులకు పాట్లు తప్పడంలేదు.

సవరించేందుకు 12 పిల్లర్లు

రైల్వే వంతెనను చక్కగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పాత వంతెన ప్రారంభంలో మట్టితో కట్టను ఎత్తుగా వేశారు. దీనిని తొలగించి 12 వరకు పిల్లర్లతో రోడ్డును వేసి వంతెనకు కలుపుతారు. వంతెన చక్కగా మార్చే క్రమంలో కొందరి స్థలాలు నిర్మాణానికి ఉపయోగించాల్సి ఉంటుంది. రెండు వైపులా ఉన్న రెయిలింగ్‌ను తొలగించి కొత్తదాన్ని నిర్మించాలి. వంతెనపై ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్డును కూడా వేయాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వంతెనను చక్కగా మార్చాలనేది నిర్దేశిత లక్ష్యం.

ఇప్పటికే కలెక్టర్‌ ఆదేశం

వికారాబాద్‌ రైల్వే వంతెన మరమ్మతు పనులు, వంతెనను కలుపుతూ కొత్తగా రోడ్డును వేసే పనులు త్వరగా చేపట్టాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 16న ఆయన రోడ్ల భవనాల శాఖ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి వంతెనను పరిశీలించారు. పనుల జాప్యానికి గల కారణాలను తెలుసుకున్నారు. వంతెన సమీపంలో ఉన్న క్రిస్టియన్లు, ఇతర నివాసితులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని