logo

బలవర్ధక బియ్యం.. ఆరోగ్యం పదిలం

జిల్లాలో ఆరేళ్ల లోపు బాల, బాలికలు, సాధారణ మహిళలు, గర్భిణుల ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. దీన్లో భాగంగా ఆహారంలో పోషక లోపాన్ని నివారించడానికి ఉపక్రమించింది.

Published : 20 Mar 2023 02:28 IST

అంగన్‌వాడీల్లో త్వరలో చిన్నారులు, మహిళలకు సరఫరా
న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌

తాండూరు గోదాముకు వచ్చిన బస్తాలు

జిల్లాలో ఆరేళ్ల లోపు బాల, బాలికలు, సాధారణ మహిళలు, గర్భిణుల ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. దీన్లో భాగంగా ఆహారంలో పోషక లోపాన్ని నివారించడానికి ఉపక్రమించింది. ‘బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌)’ను అంగన్‌వాడీల్లో వండి వడ్డించేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

వీటిలో ఏమున్నాయంటే..

బియ్యం పిండి, సూక్ష్మ ధాతు పోషకాలతో కూడిన మిశ్రమమే ఫోర్టిఫైడ్‌ రైస్‌. 100 గ్రాములలో 42.5 శాతం ఐరన్‌, 12.50శాతం ఫోలిక్‌, 12.5 మిల్లీ గ్రాముల చొప్పున బీ-12 పోషకాలు ఉంటాయి. మిశ్రమం ఒక్కో బస్తాలో 50 కిలోల చొప్పున ఉంటుంది. ఒక కిలో మిశ్రమాన్ని 99 కిలోల ముడి బియ్యంలో కలిపి మరపడితే పోషకాహారంగా మారుతుంది. ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.

అనేక సమస్యలతో ఇబ్బంది

ప్రస్తుతం జిల్లాలోని గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాల లోపంతో బాధపడుతున్నారు. పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల లేక పోవడాన్ని బట్టి పోషకాల లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి పిల్లలు 248 మంది ఉన్నారు. వీరితో పాటు మిగిలిన చిన్నారులందరికీ ప్రభుత్వం భారత ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను అనుసరించి ఫోర్టిఫైడ్‌ రైస్‌ అందించేందుకు ఉపక్రమించింది.

గోదాములకు బస్తాలు

అంగన్‌వాడీల్లో ప్రస్తుతం గర్భిణులు, బాలింతలు, పిల్లలకు గుడ్డు, పాలు, ఆహారం తదితరాలను అందిస్తున్నారు. ప్రతేకించి పిల్లలకు బాలామృతం పేరుతో పౌష్టికాహారాన్ని సమకూరుస్తున్నారు.తాజాగా పౌర సరఫరాల శాఖ ఫోర్టిఫైడ్‌ మిశ్రమాన్ని 50కిలోల సామర్థ్యంతో కూడిన బస్తాల్లో నింపి తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, మోమిన్‌ పేటలోని గోదాములకు సరఫరా చేస్తోంది. వీటిని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే మిల్లర్లకు సరఫరా చేస్తారు. పౌర సరఫరాల శాఖ అధికారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పటికే మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు ధాన్యంను బియ్యంగా మర పట్టించే సమయంలో ఈ మిశ్రమాన్ని కలుపుతారు.

ఇదీ లెక్క..

జిల్లాలో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు.. 968
మినీ కేంద్రాలు.. 120
ఆరేళ్ల లోపు చిన్నారులు.. 69,974
బాలింతలు.. 8,256
గర్భిణులు.. 7,290


ఉన్నతాధికారులు ఆదేశించగానే పంపిణీ

- రవి, తాండూరు పౌర సరఫరాల గోదాం ఇన్‌ఛార్జి

ఉన్నతాధికారులు ఆదేశించగానే పోషకాహార మిశ్రమ బియ్యం బస్తాలను సంబంధిత మిల్లర్లకు తరలిస్తాం. నెల రోజు కిందటే బస్తాలను గోదాములో నిల్వ చేశారు. మరిన్ని బస్తాలు రావాల్సి ఉంది. పిల్లలు, మహిళల్లో పోషకాల లోపాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం బలవర్ధక బియ్యంతో కూడిన ఆహారాన్ని అందించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని