logo

సంక్షిప్త వార్తలు

పర్యాటక సేవల్లో లోపం కలిగించిన సౌత్‌ ఇండియా ట్రావెల్స్‌ ప్రై.లిమిటెడ్‌కు వినియోగదారుల కమిషన్‌-3 జరిమానా విధించింది.

Published : 20 Mar 2023 01:44 IST

సేవా లోపాలు.. సంస్థలకు జరిమానాలు

ఈనాడు, హైదరాబాద్‌: పర్యాటక సేవల్లో లోపం కలిగించిన సౌత్‌ ఇండియా ట్రావెల్స్‌ ప్రై.లిమిటెడ్‌కు వినియోగదారుల కమిషన్‌-3 జరిమానా విధించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్‌.సూర్యనారాయణమూర్తి తన భార్యతో కలిసి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ యాత్రకు వెళ్లేందుకు ప్రతివాద సంస్థను 2022 మే నెలలో సంప్రదించారు. ప్రయాణ ప్యాకేజీలో భాగంగా రూ.50వేలు చెల్లించారు. ఆరురోజుల పాటు ఆహారం కోసం మరో రూ.5 వేలు అదనంగా చెల్లించారు. ప్రయాణ సమయంలో నియమించిన డ్రైవర్‌ నిర్లక్ష్య ధోరణి, టాక్సీ కోసం అదనపు చెల్లింపులు, వసతి, ఆహారంలో నాణ్యతా లోపం, అపరిశుభ్ర వాతావరణంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యామంటూ ప్రతివాద సంస్థకు విన్నవించారు. హామీలపై ప్రశ్నించినా పట్టించుకోలేదు. పరిహారం కోసం కమిషన్‌ను ఆశ్రయించగా.. ట్యాక్సీ కోసం అదనంగా చెల్లించిన రూ.8 వేలు రీఫండ్‌ చేయడంతో పాటు గది ఛార్జీలు రూ.1,000, పరిహారం రూ.10 వేలు, కేసు ఖర్చులు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది.ః సేవా లోపాలకు పాల్పడిన రెనాల్ట్‌ హైదరాబాద్‌, శ్రీశ్రీశ్రీఆటో కార్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు కమిషన్‌-2 జరిమానా విధించింది. కవాడిగూడకు చెందిన జయప్రద ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌.. సాక్ష్యాధారాలు పరిశీలించి తీర్పు వెలువరించింది. కారు మరమ్మతులకైన రూ.7,74,352, 12 శాతం వడ్డీతో చెల్లించాలని, రూ.25వేలు పరిహారం, రూ.10వేలు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.ః సాంకేతిక సేవా లోపంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించిన ‘మేక్‌ మై ట్రిప్‌ సంస్థ’కు వినియోగదారుల కమిషన్‌-3 జరిమానా విధించింది. బంధువు అంత్యక్రియలకు చెన్నై వెళ్లేందుకు ప్రతివాద సంస్థనుంచి విమాన టిక్కెట్లు బుక్‌ చేయగా, సాంకేతిక కారణాలతో ప్రయాణ సమయం గంట వృథా అయ్యిందని సికింద్రాబాద్‌కు చెందిన డి.వి.లక్ష్మీపతి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అసౌకర్యానికి పరిహారం ఇప్పించాలని కోరగా.. విచారించిన కమిషన్‌ రూ.5 వేల జరిమానా, రూ.1,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.


‘ట్రిపుల్‌ ఐటీ అంకుర సంస్థ’కు రూ.2.50 కోట్ల పెట్టుబడి

ఈనాడు, హైదరాబాద్‌: ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌-అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సంయుక్తంగా ప్రోత్సహిస్తున్న సంకల్ప్‌ అంకుర సంస్థకు రూ.2.50 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రీన్‌ఎనర్జీ కంపెనీ వేదాంత్‌ ఇంపాక్ట్‌.. రాజస్థాన్‌లోని పశుసంవర్ధక విభాగ సంస్థ చెరో రూ.కోటి పెట్టుబడులు పెట్టాయని ట్రిపుల్‌ఐటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ద్వారా.. మరో రూ.50 లక్షలు బయోటిక్‌ ఇగ్నిషన్‌ గ్రాంట్‌ కింద సమకూరాయని వివరించారు. సంకల్ప్‌ అంకుర సంస్థను స్థాపించిన అమిత్‌ పన్వర్‌, దుష్యంత్‌ కుమార్‌లు అంధులు సులభంగా రోడ్లపై వెళ్లేందుకు వీలుగా ఒక పరికరాన్ని రూపొందించారన్నారు.


బీసీ గురుకులాలకు భవనాల నిర్మాణంలో నిర్లక్ష్యం

అంబర్‌పేట: బీసీ గురుకులాలు, వసతిగృహాలకు సొంత భవనాలను నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి అన్నారు. సూర్యాపేట జిల్లాలో బీసీ గురుకుల పాఠశాలలో బాత్రూమ్‌లు లేక ఆరుబయట స్నానం చేస్తున్న విద్యార్థులపై ప్రహరీ కూలిన ఘటనలో విద్యార్థి మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయన్నారు. ఆదివారం అంబర్‌పేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతులు లేని పాత అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నేతలు సతీశ్‌, శ్రీకాంత్‌, మహేశ్‌, సురేశ్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని