logo

నవీన్‌ హత్య కేసులో నిందితురాలు బెయిల్‌పై విడుదల

తీవ్ర సంచలనంగా మారిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు నిందితుల్లో ఏ3గా ఉన్న యువతి బెయిల్‌పై విడుదలైంది.

Published : 20 Mar 2023 01:49 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: తీవ్ర సంచలనంగా మారిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు నిందితుల్లో ఏ3గా ఉన్న యువతి బెయిల్‌పై విడుదలైంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలో ఫిబ్రవరి 17న రాత్రి ఇంజినీరింగ్‌ విద్యార్థి నవీన్‌ను అతడి స్నేహితుడు హరిహరకృష్ణ కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడిగా ఉన్న అతను ఫిబ్రవరి 24న పోలీసులకు లొంగిపోవడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదుచేసి హరిహరకృష్ణను కోర్టులో హాజరుపర్చి చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం కోర్టు అనుమతితో విచారించారు. హత్య అనంతరం మిత్రుడు హసన్‌ ఇంటికి వెళ్లి అక్కడే రాత్రి ఉన్నట్లు తేల్చారు. మరుసటిరోజు హస్తినాపురంలో యువతిని సైతం కలిసి, ఆమె రూ.1500 పంపడంతో వరంగల్‌ వెళ్లినట్లు గుర్తించారు.  మరోరోజు ఆమెను ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి చూపించినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో నవీన్‌ హత్య కేసులో ఏ2గా హసన్‌ను, ఏ3గా యువతిని చేర్చిన పోలీసులు ఈనెల 6న ఇద్దరినీ అరెస్టుచేశారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో హసన్‌ను చర్లపల్లి జైలుకు, ఆమెను చంచల్‌గూడ మహిళా కారాగారానికి తరలించారు. ఇటీవల ఆమెను కస్టడీకి కోరుతూ అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్‌కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఆమె తరఫున న్యాయవాది బెయిల్‌కోసం పిటిషన్‌ వేశారు. కోర్టు యువతికి బెయిల్‌ మంజూరు చేసింది. శనివారం పూచీకత్తులు సమర్పించడంతో జైలు అధికారులు ఆదివారం ఉదయం విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని