logo

రికార్డులు మార్చేసి.. ఉచితాన్ని అమ్మేసి

గ్రేటర్‌లో కొన్నాళ్లుగా అమలు చేస్తున్న ఉచిత నీటి పథకాన్ని కొందరు క్షేత్రస్థాయి జలమండలి సిబ్బంది అమ్మకానికి పెట్టారు. రికార్డుల్లో వివరాలను తారుమారు చేసి అనర్హులకు మేలు చేస్తామని కొత్త దందాకు తెరతీశారు.

Published : 20 Mar 2023 02:28 IST

‘ఉచిత నీటి పథకం’ కోసం వివరాల మార్పిడి
భారీగా వసూలు చేస్తున్న జలమండలి సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌లో కొన్నాళ్లుగా అమలు చేస్తున్న ఉచిత నీటి పథకాన్ని కొందరు క్షేత్రస్థాయి జలమండలి సిబ్బంది అమ్మకానికి పెట్టారు. రికార్డుల్లో వివరాలను తారుమారు చేసి అనర్హులకు మేలు చేస్తామని కొత్త దందాకు తెరతీశారు. ఒక్కో నల్లాను ఇలా మార్చడానికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. సైనిక్‌పురి డివిజన్‌లో ఓ సెక్షన్‌ ఏకంగా 400 నల్లాల రికార్డులను మార్చేసి...అర్హత కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. అల్వాల్‌ డివిజన్‌లోనూ భారీ ఎత్తున ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇందులో డివిజన్‌ స్థాయిలో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జలమండలికి ఆదాయం రాకపోగా... రూ.వందల కోట్లు ప్రజాధనం వెచ్చించి నగరానికి తరలిస్తున్న తాగునీరు ఇలా అక్రమార్కుల పాలవుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఉచిత నీటి పథకానికి అర్హత సాధించాలంటే నల్లా ఉన్న ఇంటికి జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఆక్యుపెన్సీ తప్పనిసరి. 250 చదరపు గజాలపైన స్టిల్టుతో కలిపి రెండు అంతస్తులు దాటిన ప్రతి ఇంటికి ఇది తీసుకోవాల్సిందే. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత 10 శాతం కంటే తక్కువ అతిక్రమణ ఉంటేనే దీన్ని జారీ చేస్తారు. లేదంటే అలాంటి వాటికి మూడు రెట్ల ఇంటి పన్నును వసూలు చేస్తారు. జలమండలి కూడా ఇదే నిబంధనను అనుసరిస్తోంది. మూడురెట్ల నీటి బిల్లులతో పాటు ఉచిత నీటి పథకానికి అనర్హులుగా చూపుతోంది.

జాబితాలో గల్లంతుతో అనుమానం..

ఆక్సుపెన్సీ లేకుండా మూడు రెట్లు నీటి బిల్లులు చెల్లిస్తున్న ఇళ్ల జాబితా తీసుకొని కొంతమంది జలమండలి సిబ్బంది వారితో బేరసారాలు నడుపుతున్నారు. సైనిక్‌పురి, అల్వాల్‌ పరిధిలో దళారులతో ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు అంతర్గత విచారణలో తేలింది. ఆక్సుపెన్సీ లేకున్నా సరే...రికార్డుల్లో సమర్పించినట్లు మార్పులు చేస్తామని చెప్పి భారీగా వసూలు చేస్తున్నారు. సైనిక్‌పురిలో తొలుత ఇది బయట పడింది. గతంలో మూడు రెట్లు బిల్లులు జారీ అవుతున్న ఇళ్ల జాబితా నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో ఇళ్లు మాయం కావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆరా తీస్తే ఒకే ప్రాంతంలో 400 మంది ఆక్యుపెన్సీ సమర్పించినట్లు చూపించారు. ఉద్దేశ పూర్వకంగానే రికార్డుల్లో తారుమారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆక్సుపెన్సీ దందాతో...జలమండలి ఆదాయానికి టోకరా వేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే...అసలు అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.


జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం 250 చదరపు గజాలు..స్టిల్టుతో కలిసి రెండు అంతస్తులు దాటిన భవనాలకే కాకుండా.. 100 చదరపు గజాల్లో 2012 కంటే ముందు నిర్మించిన ఇళ్లను పరిగణలోకి తీసుకుంటోంది. ఇలాంటి ఇళ్లలో జీప్లస్‌ 1 కంటే ఎక్కువ అంతస్తులు ఉంటే వాటికీ పథకం వర్తించదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని