logo

కడుపు మండుతోంది

ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కళాశాలల వసతి గృహాల్లోని డిగ్రీ, పీజీ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. హాస్టల్‌లో తినలేక.. బయట కొనలేక.. కడుపు మాడ్చుకొని చదువులు సాగిస్తున్నారు.

Published : 20 Mar 2023 02:28 IST

ఓయూ వసతి గృహాల్లో నాసిరకం భోజనం
సరఫరాదారులకు ఆలస్యంగా బిల్లుల చెల్లింపు

ఈనాడు, హైదరాబాద్‌, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్‌, ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కళాశాలల వసతి గృహాల్లోని డిగ్రీ, పీజీ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. హాస్టల్‌లో తినలేక.. బయట కొనలేక.. కడుపు మాడ్చుకొని చదువులు సాగిస్తున్నారు. బియ్యం, కూరగాయలు, నూనె, ఇతర నిత్యావసరాలు సరఫరా చేసే గుత్తేదారులకు అలస్యంగా బిల్లులు చెల్లిస్తుండడంతో ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. దొడ్డు అన్నం, నీళ్ల సాంబారు, కూర మాత్రమే ఇస్తున్నారు. ఆదివారం చిన్న కప్పులో చికెన్‌ వడ్డిస్తున్నారు. సరఫరాదారులకు ఇచ్చేందుకు బడ్జెట్‌ లేకపోవడం, విద్యార్థుల నుంచి మెస్‌ బిల్లులు వసూలు చేయడంలో జాప్యం కారణంతో వంటవారికి డబ్బులిచ్చేందుకూ ఇబ్బందులు తప్పడం లేదు. గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఉచితంగా సరఫరా చేస్తున్న సన్నబియ్యం తమకూ ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉపకార వేతనాలు సక్రమంగా చెల్లిస్తే భోజనం బాగుటుందని అభిప్రాయపడుతున్నారు.

ఉపకార వేతనాలే ఇంధనం...

ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌, నిజాం కళాశాల, మహిళా విశ్వవిద్యాలయం, సైఫాబాద్‌ పీజీ కళాశాలల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రభుత్వం చెల్లించాలి. ఇందుల్లోంచి మెస్‌బిల్లు మొత్తాన్ని అధికారులు మినహాయించుకుంటున్నారు. రెండేళ్ల నుంచి ఉపకార వేతనాలు సక్రమంగా రాకపోవడంతో విద్యార్థులే మెస్‌ ఛార్జీలను భరిస్తున్నారు. అధికారులే మెస్‌లను నిర్వహిస్తున్నారు. బియ్యం, కూరగాయలు, గోధుమపిండి, ఇతర పదార్థాలకు సరిపడా డబ్బు వసూలు కాకపోవడంతో పప్పును మెనూలోంచి తీసేశారు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో పాలకూర, చుక్కకూర, ఆకుకూర పప్పును వడ్డిస్తున్నారు.

సర్దుకుపోవాల్సిందే..

ఈ వసతిగృహాల్లో ఉండే విద్యార్థుల్లో ఎక్కువ మంది నిరుపేదలే. భోజనం రుచికరంగా, నాణ్యతగా లేకపోయినా సర్దుకుపోతున్నారు. తరచూ అన్నంలో చిన్నచిన్న పురుగులు, సాంబారులో బొద్దింకలు వస్తున్నాయని వాపోతున్నారు. 

* ఓయూలోని విద్యార్థినుల వసతిగృహంలో 900 మందికి ఒకే ఆహారశాల ఉంది. నాలుగు అంతస్తులున్న వసతిగృహంలో మధ్యాహ్నం, రాత్రి భోజనం తినేందుకు కిందకు రావాలి. విద్యుత్తు సరఫరా నిలిచిపోతే ఇబ్బందులే.

* మహిళా విశ్వవిద్యాలయంలో భోజనం నాణ్యత సరిగా లేకపోయినా తినక తప్పడం లేదని     విద్యార్థినులు అంటున్నారు. ఫిర్యాదు చేస్తే...తమనే లక్ష్యంగా చేసుకుంటారన్న భావనతో రోజులు గడిపేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని